టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. ప్రజావేదికను కూల్చి అమరావతిని నాశనం చేశాడని మండిపడ్డారు. చంద్రబాబు కట్టినది ఏదీ మిగలకూడదని అనుకుంటున్నాడని, సైకో జగన్ విధ్వంసంతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని పేర్కొన్నారు. అధికార మదమెక్కిన జగన్ పిచ్చి తగ్గాలంటే లండన్ మందుల డోసు సరిపోదని వ్యాఖ్యానించారు. సైకో పోయి సైకిల్ వచ్చినప్పుడు జగన్ పిచ్చి కుదురుతుందని లోకేశ్ వివరించారు. కాగా, చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా రేపు నారా లోకేశ్ ఢిల్లీలో ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ నివాసంలో ఒక్క రోజు నిరాహార దీక్ష చేపట్టనుండడం తెలిసిందే.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో అక్టోబరు 4న విచారణకు రావాలని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు ఆంధ్రప్రదేశ్ సీఐడీ నోటీసులిచ్చింది. తొలుత వాట్సప్ ద్వారా సీఐడీ అధికారులు లోకేష్ కు నోటీసు పంపారు. నోటీసు అందినట్లు లోకేష్ కూడా వాట్సాప్‌లో సీఐడీకి సమాధానమిచ్చారు. కానీ సీఐడీ అధికారులు ఢిల్లీలోని ఎంపీ గల్లా జయదేవ్ కార్యాలయంలో ఉన్న లోకేష్ వద్దకు వెళ్లి ప్రత్యక్షంగా నోటీసులు మరోసారి అందజేశారు. అక్టోబరు 4న ఉదయం 10గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసులో తెలిపారు. విజయవాడలోని సీఐడీ కార్యాలయంలో విచారణ ఉంటుందని లోకేష్‌కు చెప్పారు.