రేపటి నుంచి టీడీపీ నేత నారా లోకేష్ ఏపీలో పాదయాత్ర చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే, ఏపీ ప్రజలకు నారా లోకేష్ బహిరంగ లేఖ రాశారు. మీ కోసం వస్తున్నా అంటూ ఎమోషనల్ అయ్యారు లోకేష్. ఏపీని సంక్షోభంలోకి నెట్టేస్తున్న జగన్ సర్కార్ ను గద్దె దింపాల్సిందేనని పిలుపునిచ్చారు. ప్రజల తరపున ఉద్యమించాలని తాను నిర్ణయించుకున్నానని, రాష్ట్రంలో ఇబ్బందులు పడుతున్న సకల జనుల గొంతుకనవుతాను అన్నారు.
సమాజం అనే దేవాలయంలో కొలువైన దేవుళ్ళయిన ప్రజలకు నారా లోకేష్ అను రాస్తున్న బహిరంగ లేఖ అంటూ, లేఖ ఇలా రాశారు. ‘విభజన అనంతరం లోటు బడ్జెట్ తో ఏర్పడిన రాష్ట్రాన్ని ఐదేళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం గాడిలో పెట్టి, నవ్యాంధ్ర నిర్మాణానికి చేసిన కృషి మీకు తెలుసు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని కాళ్ళ వేళ్ళ ప్రాధేయపడి 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం సాధిస్తున్న విధ్వంసం మీరంతా చూస్తూనే ఉన్నారు. వైసిపి బాదుడే బాదుడు పాలనలో బాధితులు కానీ వారు లేరు. ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రాథమికంగా పౌరులకు ఇచ్చిన ప్రశ్నించే హక్కును వైసిపి నేతలు హరించారు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి నియంత కంటే ఘోరంగా రాక్షస పాలన కొనసాగిస్తున్నారు’ అన్నారు.