టీడీపీలోకి ఎన్టీఆర్ ఎంట్రీ..నారా రోహిత్ కామెంట్స్!

జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి రావాలని, టి‌డి‌పి పగ్గాలు చేపట్టాలని ఎప్పటినుంచో డిమాండ్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. టి‌డి‌పిలో ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్..పార్టీ పగ్గాలు ఎన్టీఆర్ కు అప్పగించాలని కోరుతున్నారు. అలాగే టి‌డి‌పి సభలో సి‌ఎం ఎన్టీఆర్ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. అయితే చంద్రబాబు గాని, లోకేష్ గాని ఎన్టీఆర్ ఊసు తీయడం లేదు. అటు ఎన్టీఆర్‌కు సైతం ఇప్పటిలో రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.

అయినా సరే ఎన్టీఆర్ పై చర్చ ఆగడం లేదు. ఇటీవల కూడా విద్యార్ధులతో ముఖాముఖీ మాట్లాడుతున్న లోకేష్‌కు ఎన్టీఆర్‌ని రాజకీయాల్లోకి ఆహ్వానిస్తారా? అనే ప్రశ్న ఎదురైంది. దానికి లోకేష్ తప్పకుండా ఆహ్వానిస్తానని, ప్రజలకు మంచి చేసేవారు రాజకీయాల్లోకి రావాలని, పవన్, ఎన్టీఆర్ లాంటి వారు రాజకీయాల్లో ఉండాలని కోరారు. ఇప్పుడు నారా రోహిత్..ఎన్టీఆర్ రాజకీయాల్లో ఎంట్రీపై కామెంట్ చేశారు. చంద్రబాబు సోదరుడు కుమారుడుగా సినీ రంగంలో ఉన్న రోహిత్..టి‌డి‌పికి మద్ధతుగా ఎప్పుడు ప్రచారం చేస్తూ ఉంటారు.

తాజాగా నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఉమ్మడి అనంతపురం  పుట్టపర్తిలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతుంది. అక్కడకెళ్లి రోహిత్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైసీపీ డెఫన్స్‌లో పడిందని.. అందుకే తెలుగుదేశం పార్టీపై బురదజల్లుతున్నారని, యువగళం పాదయాత్ర మున్ముందు ప్రభంజనం రేపుతుందన్నారు.

యువత రాజకీయాల్లోకి రావాల్సిన సమయం ఆసన్నమైందని, ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై సైతం నారా రోహిత్ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. అవసరమైనప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సైతం రాజకీయాల్లోకి వస్తారని, తెలుగుదేశం పార్టీకి మద్ధతుగా ఉంటారన్నట్లు చెప్పుకొచ్చారు.