మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి ఊరేగింపులో ఓ ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడింది. ఈ ఘటనలో 13 మంది దుర్మరణం చెందారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వారిని భోపాల్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నట్లు వెల్లడించారు.
ఈ రోడ్డు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్పందించారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన రాష్ట్రపతి గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కూడా స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.