అప్పుడే సత్యం రామలింగరాజును కలిశా: ఆనంద్‌ మహీంద్రా

-

‘సత్యం సంస్థ కుంభకోణం వెలుగులోకి వచ్చే ఏడాది ముందే ఓ ప్రతిపాదనతో నేను రామలింగరాజు వద్దకు వెళ్లాను. అయితే నా ప్రతిపాదనకు రామలింగరాజు నుంచి స్పందన రాలేదు. ఆ కంపెనీ ఖాతాల్లో పొరబాట్లు ఆయనకు ముందే తెలుసు కాబట్టే స్పందించలేదేమో’.. అని అప్పటి రోజులను గుర్తుకు తెచ్చుకుంటూ మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా పేర్కొన్నారు.

రూ.5,000 కోట్ల కుంభకోణం జరిగిందంటూ ఎక్స్ఛేంజీలకు రామలింగరాజు లేఖ రాయడం మొదలుకుని.. సత్యం కంప్యూటర్స్‌ను విలీనం చేసేందుకు, టెక్‌ మహీంద్రాను ప్రభుత్వ బోర్డు ఎంపిక చేసినంత వరకు జరిగిన 100 రోజుల ప్రయాణంపై రాసిన పుస్తకావిష్కరణలో ఆయన మాట్లాడారు.

‘టెక్‌ మహీంద్రా, సత్యం కంప్యూటర్స్‌ విలీన ఆఫర్‌తో ఆయన ముందుకు వెళ్లాను. కానీ ఆయన ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఏడాదికి సత్యంలో కుంభకోణం బయటపడింది. సత్యం అమ్మకం సమయంలో, కుంభకోణం అనంతరం ఉన్న సంక్లిష్టతల దృష్ట్యా ఎల్‌ అండ్‌ టీ మినహా ఏ కంపెనీ కూడా మాకు పోటీలో నిలవలేదు. చివరకు ఎల్‌ అండ్‌ టీ వేసిన రూ.45.90(ఒక్కో షేరుకు) బిడ్‌తో పోలిస్తే ఎక్కువగా రూ.58తో బిడ్‌ వేసి విజయవంతమయ్యామ’ని ఆనంద్‌ మహీంద్రా వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news