ఒడిశా రైలు ప్రమాదంలో ఏపీ ప్రయాణికులు.. ఆందోళనలో కుటుంబ సభ్యులు

-

ఒడిశాలోని బాలేశ్వర్‌ సమీపంలోని బహనాగ్‌బజార్‌ రైల్వేస్టేషన్‌ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 233 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాద బాధితుల్లో ఎక్కువగా బెంగాల్​కు చెందిన వారే ఉన్నారని ఓ అధికారి తెలిపారు. అయితే ప్రయాణికుల్లో ఏపీకి చెందిన వారు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నట్లు సమాచారం. షాలిమార్‌ నుంచి చెన్నై వస్తున్న కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌, యశ్వంత్‌పూర్‌ నుంచి హావ్‌డా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి గురయ్యాయి. ఈ రెండింటిలోనూ తెలుగువాళ్లు ఉన్నారు. ముఖ్యంగా కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కువ మంది ప్రయాణికులు ఏపీకి వస్తున్నట్లు రైల్వే అధికారుల వద్ద ఉన్న జాబితా బట్టి తెలుస్తోంది.

కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో.. షాలిమార్‌, సంత్రగచ్చి, ఖరగ్‌పూర్‌, బాలేశ్వర్‌ స్టేషన్లలో ఎక్కిన ప్రయాణికుల్లో విజయవాడలో 47 మంది, రాజమహేంద్రవరంలో 22 మంది, ఏలూరుకు ఒకరు కలిపి మొత్తంగా 70 మంది వరకు దిగాల్సి ఉంది.  ఇదే రైలులో రాజమహేంద్రవరం స్టేషన్‌ నుంచి 56 మంది, తాడేపల్లిగూడెంలో 10మంది, ఏలూరులో 44 మంది, విజయవాడలో 120 మంది ప్రయాణికులు ఎక్కి.. చెన్నై సెంట్రల్‌ స్టేషన్‌కు వెళ్లేలా రిజర్వేషన్లు చేసుకున్నారని రైల్వే అధికారులు వెల్లడించారు. ఆ రైల్లలో ప్రయాణిస్తున్న తమ వారు ప్రాణాలతో ఉన్నారో లేదోనని.. వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news