న్యూఢిల్లీః త్వరలో ఎన్నికలు జరగనున్న పలు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దూకుడుగా ముందుకు వెళ్తోంది. ఆ పార్టీ నాయకులు సైతం సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఇతర పార్టీ నేతలను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా బెంగాల్ బీజేపీకి చెందిన నాయకుడు ఇదే తరహా వ్యాఖ్యలు చేయడం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే పలు పార్టీలకు చెందిన కీలక నేతలు బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలోనే అధికార తృణముల్ కాంగ్రెస్, బీజేపీల మధ్య పచ్చగడ్డి వేసిన బుడిదయ్యే రీతిలో విమర్శలు, ఆరోపణలు ఇరు పార్టీల నాయకులు చేస్తున్నారు.
ఇలాంటి నేపథ్యంలో తాజాగా బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర అధికార పార్టీ తృణముల్ కాంగ్రెస్‌కు చెందిన 50 మంది ఎమ్మెల్యేలు త్వరలోనే బీజేపీలో చేరనున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆ పార్టీని వీడిన నేతలు మళ్లీ చేరేందుకు లైన్‌లో ఉన్నారంటూ టీఎంసీ నేత మల్లిక్ చేసిన వ్యాఖ్యలు గాలిమాటలేనని కొట్టిపారేశారు. మీరు చెబుతున్నదే నిజమైతే ఒక్క బీజేపీ నేతను టీఎంసీలో చేర్చుకుని వారు దమ్ము నిరూపించుకోవాలంటూ సవాలు విసిరారు.
ఇక టీఎంసీకి చెందిన 50 మంది ఎమ్మెల్యేలు వచ్చే నెలలో బీజేపీ కండువా కప్పుకోవడానికి ముహుర్తం సైతం ఖరారైందని దిలీప్ ఘోష్ స్పష్టం చేశారు. ఇటీవల టీఎంసీకి చెందిన కీలక నేత, రాష్ట్ర మాజీ మంత్రి సువేందు అధికారి సహా మరికొంత మంది టీఎంసీ నేతలు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో దీలిప్ ఘోష్ తాజా వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ చర్చకు తెరలేపాయి. అయితే, 50 మంది టీఎంసీ నేతలు కాకపోయిన కొద్ది మంది నేతలైతే కమళం కిందకు వెళ్లే అవకాశాలైతే ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరీ ముఖ్యంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మళ్లీ బెంగాల్ పర్యటనకు త్వరలోనే వెళ్లనుండటం దీనికి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.