బర్త్ డే పార్టీ.. ఎంగేజ్మెంట్ సెర్మనీ.. వివాహ వేడుక.. గెట్ టుగెదర్.. ఇల పార్టీ ఏదైనా.. గెస్టులు ఎవరైనా.. అక్కడ బిర్యానీ మస్ట్‌గా ఉండాల్సిందే. రోజూ ఒకే రకం ఫుడ్ తిని బోర్ కొట్టినా.. రెస్టారెంట్లో తినాలని ఆశ పుట్టినా.. ముందుగా గుర్తొచ్చేది బిర్యానీయే. బిర్యానీ.. ఫుడ్ కాదు.. ఒక ఎమోషన్. కోపంగా ఉన్నా.. బాధగా అనిపించినా.. ఆనందంలో ఉన్నా.. కొందరు బిర్యానీ తింటుంటారు. భారతీయుల లైఫ్‌లో బిర్యానీ ఒక భాగమైపోయిందంటే అతిశయోక్తి కాదు.
అందుకే ఆన్లైన్ ఫుడ్ డెలివరీలో ఎక్కువగా బిర్యానీ ఆర్డర్లే వస్తుంటాయి. ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ బిర్యానీ లెక్కలను బయట పెట్టింది. గత 12 నెలల్లో దేశవ్యాప్తంగా ఉన్న భోజన ప్రియులు ఏకంగా 7.6కోట్ల బిర్యానీలను ఆన్లైన్లో ఆర్డర్ చేసినట్లు వెల్లడించింది.
2022 జూన్ నుంచి 2023 జూన్ వరకు మొత్తం 7.6కోట్ల బిర్యానీలకు ఆర్డర్లు వచ్చాయట. క్రితం ఏడాది ఇదే సమయంతో పోల్చితే గత ఐదున్నర నెలల్లో బిర్యానీ ఆర్డర్లలో 8.26శాతం వృద్ధి ఉన్నట్లు స్విగ్గీ తెలిపింది. స్విగ్గీ ద్వారా బిర్యానీ కోసం నిమిషానికి 219 ఆర్డర్లు వెళ్తున్నాయట.