సార్వత్రిక ఎన్నికల వేళ ప్రముఖ భోజ్‌పురి నటుడు, గాయకుడు పవన్ సింగ్పై బీజేపీ వేటు వేసింది. సొంత పార్టీ అభ్యర్థిపైనే స్వతంత్రుడిగా పోటీకి నిలబడ్డ పవన్ నామినేషన్ కూడా వేశారు. అతణ్ని నామినేషన్ వెనక్కి తీసుకోవాలని పార్టీ ఆదేశించినా నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో అతడిపై బీజేపీ క్రమశిక్షణా చర్యలు తీసుకొని పార్టీ నుంచి బహిష్కరించింది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో తొలుత పవన్‌సింగ్‌కు బీజేపీ పశ్చిమ బెంగాల్ నుంచి టికెట్ కేటాయించింది. అసన్‌సోల్ స్థానం నుంచి అభ్యర్థిగా ప్రకటించగా.. అదే సమయంలో అతడి పాటలపై తీవ్ర విమర్శలు రావడంతో ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయలేనంటూ పవన్ వెనక్కి తగ్గారు.
కొన్ని రోజుల తర్వాత అనూహ్యంగా సొంత రాష్ట్రం బిహార్‌లోని కారాకట్ నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించాడు. ఎన్డీయే పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని బీజేపీ మిత్రపక్షమైన రాష్ట్రీయ లోక్ మోర్చా పార్టీకి కేటాయించింది. బీజేపీ నుంచి టికెట్ దక్కకపోవడంతో పవన్ సింగ్ మే 9వ తేదీన స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.