మధ్యప్రదేశ్‌లో కోతులకు భయపడి పరిగెత్తుతూ ఏడేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు 60 అడుగుల బోరు బావిలో పడిపోయాడు. మంగళవారం రోజున జరిగిన ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది.. సహాయక చర్యలు ప్రారంభించారు.
విదిశా జిల్లాలోని లటేరీ ప్రాంతంలోని ఆనంద్‌పుర్ గ్రామానికి చెందిన లోకేశ్ అహిర్వార్ ప్రమాదవశాత్తు 60 అడుగుల బోరు బావిలో పడిపోయాడు. మంగళవారం ఉదయం లోకేశ్ తోటి స్నేహితులతో కలిసి పొలాల్లో ఆడుకోవడానికి వెళ్లాడు. వారు అడుకుంటుండగా అక్కడికి కోతుల గుంపు వచ్చింది. వాటిని చూసి చిన్నారులంతా పరిగెత్తారు. ఈ క్రమంలో లోకేశ్ కూడా పరిగెడుతూ పొలంలో తెరచి ఉన్న.. 2 అడుగుల వెడల్పు, 60 అడుగుల లోతైన ఓ బోరు బావిలో పడిపోయాడు.
గమనించిన స్నేహితులు గ్రామస్థులు తెలపగా లోకేశ్ తల్లిదండ్రులతో సహా వారంతా అక్కడికి చేరుకున్నారు. పోలీసులకు సమాచారం అందించగా వారితో పాటు మూడు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఓ ఎన్డీఆర్ఎఫ్ బృందం అక్కడికి చేరుకుని లోపల ఉన్న చిన్నారి కోసం పైపుల ద్వారా ఆక్సిజన్‌ను సరఫరా చేశారు. లోకేశ్ కదలికలను గమనించడానికి సీసీటీవీని లోపలికి పంపించి మాట్లాడే ప్రయాత్నాలు కూడా చేశారు.
ప్రస్తుతం ఆ బాలుడు దాదాపు 43 అడుగుల లోతులో చిక్కుకుపోయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. చిన్నారిని రక్షించేందుకు 5 జేసీబీలతో తవ్వడం ప్రారంభించగా ప్రస్తుతం 40 అడుగుల లోతు వరకు తవ్వగలిగారు. త్వరలోనే బాలుడ్ని కాపాడుతామని ఎన్డీఆర్ఎఫ్ డిప్యూటీ కమాండర్ అనీల్ పాల్ తెలిపారు.