మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 15మందికి పైగా మరణించినట్లు సమాచారం. మరో 50 మంది గాయపడినట్లు తెలుస్తోంది ఘర్గోన్లో ఇవాళ ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..?
మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని ఖర్గోన్లో ఊన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దాసంగ గ్రామం సమీపంలో 20 అడుగుల వంతెనపై వేగంగా వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు.. అదుపు తప్పి నదిలో పడిపోయింది. ఏం జరిగిందో తెలిసే లోపే బస్సులో ప్రయాణిస్తున్న వారిలో కొందరు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారు తీవ్రంగా గాయపడ్డారు. అంత ఎత్తు నుంచి పడడం వల్ల బస్సు నుజ్జునుజ్జు అయింది. ఫలితంగా లోపల ఉన్నవారు బయటకు రావడం కష్టమైంది.
ప్రమాదం గురించి తెలిసిన వెంటనే గ్రామస్థులు సహాయక చర్యలు చేపట్టి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు స్థానికుల సాయంతో బస్సు నుంచి క్షతగాత్రులను బయటకు తీశారు. ఖర్గోన్ జిల్లా కలెక్టర్ శివరాజ్ సింగ్ వర్మ, స్థానిక శాసనసభ్యుడు రవి జోషి ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యల్ని పర్యవేక్షించారు.