దేశంలో చీతాలు అంతరిస్తున్న నేపథ్యంలో వాటి మనుగడ కోసం కేంద్ర సర్కార్ ‘ప్రాజెక్ట్ చీతా’లో భాగంగా విదేశాల నుంచి 20 చీతాలను భారత్‌కు తీసుకువచ్చింది. ఆ చీతాల్లో వివిధ కారణాలతో ఇప్పటి వరకు 8 చీతాలు మృతి చెందాయి. అయితే ఇలా వరుసగా చీతాలు మరణించడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. రెండు విడతల్లో నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి 20 చీతాలను తీసుకురాగా ఇప్పటి వరకు 8 మృతి చెందాయి. వాతావరణ పరిస్థితులు తట్టుకోలేక పోవడం వల్లే అవి మృతి చెందుతున్నట్లు అధికారులు చెబుతున్నా వాటికి అమర్చిన రేడియో కాలర్ వల్లే ప్రాణాలు కోల్పోతున్నాయని వస్తున్న వార్తలు కలవరపెడుతున్నాయి. ఆ వార్తలకు మరింత ఊతమిచ్చేలా తాజాగా ఓ ఘటన చోటు చేసుకుంది.
మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కులో వదలిన పవన్ (ఒబన్) అనే చిరుత తాజాగా అస్వస్థతకు గురైంది. దానిని ఎన్‌క్లోజర్‌లోకి తీసుకొచ్చిన అధికారులు ప్రత్యేక వైద్య బృందంతో పరీక్షలు చేశారు. చీతా కదలికలను పసిగట్టేందుకు దాని మెడకు అమర్చిన రేడియో కాలర్ కింద గాయాలైనట్లు గుర్తించారు. వాటిలో చిన్నపాటి పురుగులు కూడా ఉన్నట్లు నిర్ధారించారు. వెంటనే కాలర్ ఐడీ ట్యాగ్‌ను తొలగించి చికిత్స నిర్వహించారు.
మరో రెండు చీతాలకు కూడా ఇదే రకంగా గాయాలైనట్లు గుర్తించారు. అన్ని చీతాలను తిరిగి ఎన్‌క్లోజర్లలోకి తీసుకొచ్చి పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత తిరిగి విడిచిపెట్టనున్నారు. వాటి కదలికలను పసిగట్టేందుకు రేడియో కాలర్ బదులు డ్రోన్‌లను ఉపయోగించే అవకాశం ఉంది.