దేశవ్యాప్తంగా తొమ్మిది ప్రాంతాల్లో ఇవాళ సీబీఐ సోదాలు నిర్వహించింది. బీమా కుంభకోణం కేసులో జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మాజీ సహాయకుడి ఇల్లు సహా పలు ప్రాంతాల్లో సీబీఐ అధికారులు సోదాలు చేపట్టారు. ఇవాళ ఉదయం నుంచే మాలిక్ మాజీ సహాయకుడి నివాసం, ఇతర ప్రదేశాల్లో దాడులు చేసినట్లు సీబీఐ అధికారి ఒకరు తెలిపారు.
బీమా కుంభకోణం కేసులో ఏప్రిల్ 28న సత్యపాల్ మాలిక్ సీబీఐ ప్రశ్నించింది. తాజాగా ఆయన సహాయకుడి ఇంట్లో దాడులు జరగడం గమనార్హం. మరోవైపు.. తన మాజీ సహాయకుడి నివాసంపై సీబీఐ దాడుల జరపడంపై జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ స్పందించారు. బీమా కుంభకోణం కేసులో ఫిర్యాదుదారుడైన తనను వేధించడం దురదృష్టకరం అని అన్నారు.
అసలు బీమా స్కామ్ ఏంటంటే.. 2018లో జమ్ముకశ్మీర్ గవర్నర్‌గా సత్యపాల్ మాలిక్ ఉన్న సమయంలో.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాల కోసం ఉద్దేశించిన వైద్య బీమా పథకంతోపాటు కిరు జలవిద్యుత్ ప్రాజెక్టులో సివిల్ వర్క్ కాంట్రాక్టుల విషయంలో అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఈ ఫైళ్లను క్లియర్ చేసేందుకు సత్యపాలిక్ మాలిక్‌కు రూ.300 కోట్ల లంచం ఇవ్వజూపారని సీబీఐ పేర్కొంది.