బెంగళూరులోని రామేశ్వరం కెఫే బాంబు పేలుడు కేసులో ఇద్దరు కీలక నిందితులను జాతీయ విచారణ సంస్థ (ఎన్ఐఏ) ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే, మార్చి 1న చోటుచేసుకున్న ఆ ఘటన అనంతరం పారిపోయిన నిందితులు.. నెలన్నర రోజులుగా వివిధ రాష్ట్రాల్లో తప్పించుకు తిరిగి చివరకు ఓ సెల్‌ఫోన్‌ను రిపేర్‌కు ఇచ్చి పోలీసులకు దొరికిపోయారు. అసలేం జరిగిందంటే?
ఎన్‌ఐఏ కీలక నిందితులుగా అనుమానిస్తున్న కోల్‌కతాకు చెందిన అరెస్టైన ముసావిర్ హుస్సేన్ షాజిబ్, అబ్దుల్ మథీన్ అహ్మద్ తాహాలు దాడి తర్వాత అనేక రాష్ట్రాలు తిరుగుతూ చివరకు పశ్చిమ బెంగాల్ చేరుకుని అనేక హోటళ్లలో తలదాచుకున్నారు. సెల్‌ఫోన్లను తరచూ మార్చుతూ 35 సిమ్ కార్డులు వాడారు. ఓ నిందితుడి సెల్‌ఫోన్‌లో సమస్య తలెత్తడంతో కోల్కతాలోని చాంద్‌నీ చౌక్ మార్కెట్లోని ఓ దుకాణంలో రిపేర్‌కు ఇచ్చారు
మైక్రోఫోన్‌లో ఏదైనా సమస్య ఉందా?అని తెలుసుకుందామనుకున్న దుకాణం యజమాని.. అతడి దగ్గరున్న ఓ సిమ్ కార్డును అందులో పెట్టి చూడటంతో.. అప్పటికే నిందుతుల ఫోన్‌ను ట్రాక్ చేస్తున్న పోలీసులు.. ఆ మొబైల్‌లో వేసిన సిమ్‌కార్డు సిగ్నల్స్‌తో అప్రమత్తమై ఫోన్ ఐఎంఈఐ నంబరు ఆధారంగా ఫోన్ ఆచూకీ కనుగొన్నారు. మొబైల్ షాప్‌నకు చేరుకున్న దర్యాప్తు అధికారులు.. యజమాని స్టేట్‌మెంట్ రికార్డు చేసుకుని చివరకు కోల్‌కతా శివారులోని దిఘా ప్రాంతంలోని ఓ హోటల్‌లో ఉన్న ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఎన్‌ఐఏ కస్టడీలో ఉన్నారు.