‘దేశంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటు’.. కేంద్రం ఏం చెప్పిందంటే..?

-

దేశంలో కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేస్తున్నారా అనే ప్రశ్నపై కేంద్ర సర్కార్ పార్లమెంట్ లో సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం కొత్తగా రాష్ట్రాలు ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ లేదని వెల్లడించింది. కాంగ్రెస్ ఎంపీ అదూర్ ప్రకాశ్‌ అడిగిన ప్రశ్నకు హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ ప్రభుత్వ వైఖరిని తెలియజేశారు.

‘పలు వేదికల నుంచి కొత్త రాష్ట్రాల ఏర్పాటుపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు, అభ్యర్థనలు అందుతుంటాయి. అయితే ఏ ప్రతిపాదన ప్రస్తుతం కేంద్రం పరిగణనలో లేదు’ అని వెల్లడించారు. అలాగే మరో ప్రశ్నకు సమాధానంగా దేశంలో వామపక్ష తీవ్రవాదం తగ్గుముఖం పట్టిందని చెప్పారు. నక్సల్స్‌ ప్రభావిత జిల్లాల సంఖ్య 2014లో 70గా ఉందని, 2021 నాటికి 46కు పడిపోయిందని చెప్పారు.

మరోవైపు.. సభ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నారని ఇవాళ రాజ్యసభలో 19 ఎంపీలపై వేటు పడింది. దీనిపై కేంద్ర మంత్రి, రాజ్యసభాపక్ష నేత పీయూష్ గోయల్ స్పందించారు. భారమైన హృదయంతో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తమకు ఈ సస్పెన్షన్ విధించడం ఏమాత్రం ఇష్టం లేదని అన్నారు. ప్రభుత్వం చర్చ నుంచి తప్పించుకుంటుందని ప్రతిపక్ష పార్టీ నేతలు ఆరోపిస్తున్నా, వాస్తవంలో ప్రతిపక్షాలే ఈ పని చేస్తున్నాయని స్పష్టం చేశారు.

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కరోనా నుంచి కోలుకొని తిరిగి వచ్చిన తర్వాత ధరల పెరుగుదల అంశంపై చర్చిస్తామని వెల్లడించారు. అందుకు తామెప్పుడూ సిద్ధమేనని స్పష్టం చేశారు. ఎన్నో దేశాలతో పోల్చుకుంటే భారత్ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడంలో మెరుగ్గా వ్యవహరించిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news