కేంద్ర సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆహార భద్రతను బలోపేతం చేయడం, సరైన ధర వచ్చే వరకు రైతులు పంటలను నిల్వ చేసుకునే వీలు కల్పించడం కోసం ఓ యోచన చేసింది. దేశంలో ఆహార ధాన్యాల నిల్వల సామర్థ్యాన్ని భారీగా పెంచేందుకు రూ.లక్ష కోట్లను వెచ్చించాలన్న ప్రతిపాదనకు ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. వచ్చే ఐదేళ్లలో సహకార రంగంలో 700 లక్షల టన్నుల మేర ఆహార ధాన్యాల నిల్వలకు ఏర్పాట్లు చేయాలని సంకల్పించింది.
దేశంలో ప్రస్తుత గిడ్డంగుల సామర్థ్యం 1,450 లక్షల టన్నులు మాత్రమే. రాబోయే ఐదేళ్లలో దాన్ని 2,150 లక్షల టన్నులకు పెంచాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార ధాన్యాల నిల్వ కార్యక్రమంగా కేంద్రమంత్రి అనురాగ్ ఠాగూర్ దీనిని అభివర్ణించారు. ప్రతి బ్లాకులో 2 వేల టన్నుల సామర్థ్యంతో కొత్తగా గోదాములు ఏర్పాటు చేస్తాం. ఇవి అందుబాటులోకి వస్తే తమ ఉత్పత్తులను నష్టానికి విక్రయించాల్సిన అవసరం రైతులకు ఉండదని తెలిపారు.