రెజ్లర్లకు ఎమ్మెల్సీ కవిత మద్దతు.. బ్రిజ్ భూషన్​పై చర్యలకు డిమాండ్

-

భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్​ తమను లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ గత కొద్ది నెలలుగా రెజ్లర్లు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారికి దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు మద్దతునిస్తున్నాయి. తాజాగా రెజ్లర్ల ఆందోళనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. వారికి తన మద్దతు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. రెజ్లర్లను లైంగికంగా వేధించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్‌భూషణ్‌పై..ఎందుకు చర్యలు చేపట్టడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని కవిత ప్రశ్నించారు.

కొంతకాలంగా దిల్లీలో రెజ్లర్లు నిరసనలు తెలుపుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్రం… కళ్లు తెరిచి రెజ్లర్లు లేవనెత్తుతున్న అంశాలకు పరిష్కారం చూపాలని… ఆమె డిమాండ్‌చేశారు. దేశ ప్రయోజనాల కోసం కేంద్రం ఇప్పటికైనా రెజ్లర్ల సమస్యలపై ఆలోచించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పోక్సో వంటి తీవ్ర అభియోగాలు ఉన్నా నిందితుడు బయటే తిరుగుతున్నాడని గుర్తుచేశారు. దేశానికి బంగారు పతకాలు సాధించిన మహిళాక్రీడాకారులపై అనుచితంగా వ్యవహరించడం తగదని కవిత సూచించారు. రెజ్లర్ల వ్యవహారాన్ని ప్రపంచం అంతా చూస్తోందని..కేంద్రం నుంచి ప్రజలు సమాధానం కోరుకుంటున్నారని అన్నారు. కేంద్రం ఇప్పటికైనా కళ్లు తెరిచి చర్యలు తీసుకోవాలని కవిత సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news