దేశవ్యాప్తంగా టమాట ధరలు మండిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో రికార్డు ధరలు నమోదవుతున్నాయి. టమాట కొనాలంటే జనం జంకే పరిస్థితి నెలకొంది. చాలా చోట్ల కిలో టమాట రూ.200లు పలుకుతోంది. వీటి ధరలను నియంత్రించేందుకు కేంద్రం నడుం బిగించింది. ప్రధాన వినియోగ కేంద్రాల్లో పంపిణీ చేసేందుకు గాను ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి వీటిని సేకరించాలని కేంద్ర సహకార సహకార సంస్థలైన నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ), నేషనల్ కోఆపరేటివ్ కన్జుమర్స్ ఫెడరేషన్‌లను ఆదేశించింది. గత నెల రోజులుగా టమాట ధరలు రికార్డు స్థాయికి చేరుకున్న ప్రాంతాలను గుర్తించి, అక్కడి రిటైల్ కేంద్రాల్లో పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
‘గుజరాత్, మధ్యప్రదేశ్‌తోపాటు మరికొన్ని రాష్ట్రాలకు ప్రస్తుతం మహారాష్ట్ర నుంచి టమాటాలు సరఫరా అవుతున్నాయి. ఏపీలోని మదనపల్లె నుంచి సరైన పరిమాణంలోనే వస్తున్నాయి. దిల్లీకి హిమాచల్‌తోపాటు కర్ణాటక నుంచి అధికంగా వస్తాయి. మహారాష్ట్రలోని, నారాయణ్‌గావ్, ఔరంగాబాద్‌తోపాటు మధ్యప్రదేశ్ నుంచి త్వరలోనే అదనపు పంట రానుంది. దీంతో త్వరలోనే టమాట ధరలు దిగివచ్చే అవకాశం ఉంది’ అని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ అంచనా వేసింది.