మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్క్‌లో చీతాల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకు ఆరు చీతాలు మరణించగా.. తాజాగా తేజస్ అనే పేరు గల మరో చీతా మృతి చెందింది. తేజస్ మెడ భాగంలో గాయాలున్న గుర్తులను గమనించిన మానిటరింగ్ టీమ్.. పాల్పూర్ ప్రధాన కార్యాలయంలోని వన్యప్రాణి విభాగానికి తరలించారు. చికిత్స అందిస్తుండగానే చీతా మృతి చెందింది. చీతాకు మెడపై గాయాలు ఎలా అయ్యాయి? అనే విషయంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. తాజాగా చనిపోయిన చీతాతో కలిపి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో మొత్తం 4 చీతాలు, 3 చీతా పిల్లలు మరణించాయి.
తేజస్‌ను పోస్టుమార్టానికి తరలించామని, తర్వాత మృతికి గల కారణాలు తెలియజేస్తామని కునో డీఎఫ్ఓ పీకే వర్మ తెలిపారు. ప్రస్తుతం చీతా మృతిపై విచారణ కొనసాగుతుందని వివరించారు. గత 5 నెలల్లో ఏడు చీతాలు వివిధ కారణాలతో మరణించడం కలకలం రేపుతోంది. చీతా మరణంపై స్పందించిన మధ్యప్రదేశ్ అటవీ శాఖ మంత్రి కున్వర్ విజయ్ షా అధికారులతో తాను మాట్లాడానని, జంతువులు దాడి చేసుకున్నప్పుడు ఇలాంటి గాయాలు అవుతుంటాయని తెలిపారని వెల్లడించారు.