నీట్ యూజీ, యూజీసీ నెట్ ప్రశ్నపత్రాల లీకేజీతో ముసురుకున్న వివాదాల నేపథ్యంలో ఆదివారం జరగాల్సిన నీట్ పీజీ ప్రవేశ పరీక్షను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ మరోసారి స్పందించింది. సోషల్ మీడియా వేదికగా ఆ పార్టీ అధ్యక్షుడు ఈ వ్యవహారంపై స్పందిస్తూ కేంద్రంపై ధ్వజమెత్తారు.
నీట్‌లో జరిగిన అక్రమాలకు అధికారులను మార్చడం విద్యా వ్యవస్థలోని సమస్యకు పరిష్కారం కాదని ఖర్గే అన్నారు. ఎన్‌టీఏ స్వయం ప్రతిపత్తి గల సంస్థ కానీ.. ప్రస్తుతం అది బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాలకు అనుగుణంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. విద్యార్థులకు న్యాయం జరిగేలా చూసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు నీట్ పరీక్ష వాయిదా పడిందన్న ఖర్గే.. ఈ పది రోజుల్లో దాదాపు 4 పరీక్షలను వాయిదా వేయడమో, రద్దు చేయడమో చేశారని మండిపడ్డారు. పేపర్ లీకేజీలు, అవినీతి, అవకతవకలు మన విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నాయని.. దీని వల్ల నీట్ అభ్యర్థుల భవిష్యత్తు చిన్నాభిన్నం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.