ఆశలు కొన్ని ఉంటాయి. అవి నిత్యం కొత్త ప్రేరణకు సహకరిస్తాయి. ఆశలు కొన్ని ఉంటాయి.. గెలుపు దిశలో ప్రయాణించేందుకు ఉపకరిస్తాయి లేదా ఉపయోగపడతాయి. ఆశలు కొన్ని హద్దులను చెరిపి ఉంటాయి అవి నిత్యం మనల్ని ప్రపంచానికి పరిచయం చేసే క్రమంలో కొత్తదనానికి ప్రాధాన్యం ఇస్తాయి. ఆశల కారణంగానే ఓటమి మరియు గెలుపు అన్నవి కూడా ఆధారపడి ఉంటాయి. రాజకీయ జీవితాల్లో ఆశలు కోకొల్లలు. కానీ కొందరికి అవి నెరవేరి అందలం అందిస్తాయి. తిరుగులేని నాయకత్వాన్ని ప్రసాదిస్తాయి. తిరుగులేని శక్తిగా అవతరించేందుకు సహకరిస్తాయి.
కానీ కొద్ది కాలంగా ఇవన్నీ అధినేత్రి సోనియా విషయమై తారుమారు అవుతున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఒకప్పటిలా శక్తిమంతం అయిన నాయకులు లేరు. కార్యకర్తలంతా చెరో దిక్కులో ఉండిపోయారు. కొందరు ఫక్తు అభిమానులు దిక్కు తోచక ఉన్నారు. ఒక నాటి కాంగ్రెస్ పార్టీ కి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎంతో తేడా ? గాంధీ కుటుంబ నాయకత్వంపై నమ్మకాలు లేవు. గాంధీయేతర కుటుంబానికి చెందిన నాయకులెవ్వరూ సోనియాకు మరీ అంత విధేయులుగా లేరు. ఈక్రమంలో కపిల్ సిబల్ లాంటి తిరుగుబాటు నేతలు ఎప్పటికప్పుడు అసమ్మతి రాగం వినిపిస్తూనే ఉన్నారు. ఈ దశలో కాంగ్రెస్ ఆదుకునే నాయకత్వం రావాలి.
ఓ నాడు వైఎస్సార్ ఆ పనిచేశారు. గాంధీ భవన్ గబ్బిలాలను తరిమి కొట్టలేకపోయినా, సంబంధిత వ్యక్తులను నియంత్రించగలిగా రు. ఆ పని రేవంత్ రెడ్డి చేయలేకపోయారు.ఆ పని అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి కూడా చేయలేకపోయారు. ఆ రోజు అధిష్టానం ఏంచెబితే అది ఎంత చెబితే అంత అన్న విధంగా వైఎస్సార్ తరువాత రోశయ్య కానీ కిరణ్ కానీ వ్యవహరించి కేవలం సీఎం కుర్చీకే పరిమితం అయిపోయారు అన్న విమర్శలు మూటగట్టుకున్నారు.
ఇక ఓ విధంగా ఐసీయూలో ఉన్న కాంగ్రెస్ ను ఇంకా చెప్పాలంటే అంపశయ్యపై ఉన్న కాంగ్రెస్ ను ఆదుకోవాలని ప్రశాంత్ కిశోర్ అనుకుంటున్నారా లేదా ఆయన కూడా ఏదయినా ఓ పొలిటికల్ డ్రామా ఆడుతున్నారా అన్నది ఇప్పటి ప్రశ్న లేదా సందేహం కూడా ! దక్షిణాదిలో కాంగ్రెస్ ఏం చేసినా పుంజుకోదు అని తేలిపోయాక పొత్తుల గోలను తెరపైకి తెచ్చారు పీకే. కానీ ఇది కూడా ఓ కొలిక్కి వచ్చే విధంగా లేదు. మరి! సోనియా ఆశలు నెరవేరు దారి ఏది ? ఏమో పై వాడికే ఎరుక మరియు పీకేకు కూడా కొద్దిగా ఎరుక !