భార‌త్‌లో కోవిడ్ మూడో వేవ్ అక్టోబ‌ర్‌లో వ‌చ్చే అవ‌కాశం.. నిపుణుల వెల్ల‌డి..

దేశ‌వ్యాప్తంగా కోవిడ్ రెండో వేవ్ ప్ర‌భావం త‌గ్గుతున్న విష‌యం విదిత‌మే. గ‌త కొద్ది రోజుల క్రితం రోజువారీ కేసుల సంఖ్య భారీగా ఉండేది. కానీ ప్ర‌స్తుతం 1 ల‌క్ష‌కు దిగువ‌కు కేసులు వ‌చ్చేశాయి. జూన్ చివరి వ‌ర‌కు కేసులు మ‌రింత‌గా త‌గ్గుతాయ‌ని, కోవిడ్ రెండో వేవ్ ముగుస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అయితే అక్టోబ‌ర్ వ‌ర‌కు మూడో వేవ్ వ‌స్తుంద‌ని వైద్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఈ మేర‌కు రాయిట‌ర్స్ నిర్వ‌హించిన మెడికల్ ఎక్స్‌ప‌ర్ట్స్ పోల్‌లో వెల్ల‌డైంది.

భార‌త్‌లో కోవిడ్ మూడో వేవ్ అక్టోబ‌ర్‌లో వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంద‌ని వైద్య నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా జూన్ 3వ తేదీ నుంచి టీకాల పంపిణీ ప్ర‌క్రియ వేగం పుంజుకుంద‌ని తెలిపారు. కాగా రాయిట‌ర్స్ నిర్వ‌హించిన పోల్‌లో 85 శాతం మేర నిపుణులు అక్టోబ‌ర్‌లోనే మూడో వేవ్ వ‌స్తుంద‌ని చెప్ప‌డం విశేషం. కొంద‌రు ఆగ‌స్టు లేదా సెప్టెంబ‌ర్‌లో మూడో వేవ్ వచ్చేందుకు అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలిపారు.

ఇక పోల్‌లో కొంద‌రు వచ్చే నవంబ‌ర్ నుంచి ఫిబ్ర‌వ‌రి మ‌ధ్య మూడో వేవ్ వ‌స్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. కానీ అప్ప‌టి వ‌ర‌కు చాలా దేశాల్లో టీకాల పంపిణీ ప్ర‌క్రియ ఓ కొలిక్కి వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. భార‌త్‌లో డిసెంబ‌ర్ వ‌ర‌కు అంద‌రికీ టీకాలు వేస్తామ‌ని, అక్టోబ‌ర్ వ‌రు 44 కోట్ల డోసులు అందుబాటులోకి వ‌స్తాయ‌ని కేంద్రం ఇప్ప‌టికే వెల్ల‌డించింది. అయితే కొంద‌రు మాత్రం ఇంకో నెల రోజుల్లోనే కోవిడ్ మూడో వేవ్ రావ‌చ్చ‌ని అభిప్రాయ పడ్డారు. కానీ మెజారిటీ నిపుణులు మాత్రం అక్టోబ‌ర్‌లో మూడో వేవ్ వ‌చ్చేందుకు బ‌ల‌మైన అవ‌కాశాలు ఉన్నాయ‌న్నారు. అందువ‌ల్ల ఇప్ప‌టి నుంచే స‌న్న‌ద్ధం కావాల‌ని సూచించారు.