కోవిడ్ రెండో వేవ్ ప్రభావం తగ్గుతుండడంతో ఇప్పుడు మూడో వేవ్ వస్తుందేమోనని అంచనా వేస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కమిటీ మరో నాలుగు వారాల్లో మూడో వేవ్ వస్తుందని హెచ్చరించింది. అయితే కోవిడ్ మూడో వేవ్‌లో చిన్నారులపై వైరస్ ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉందని ఇప్పటి వరకు నిపుణులు చెబుతూ వచ్చారు. కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఎయిమ్స్‌లు సంయుక్తంగా చేపట్టిన అధ్యయనం ప్రకారం మూడో వేవ్‌లో చిన్నారులపై వైరస్ పెద్దగా ప్రభావం చూపించే అవకాశాలు లేవని వెల్లడైంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఎయిమ్స్ సైంటిస్టులు 5 ఎంపిక చేసిన రాష్ట్రాల్లో 10వేల మంది వివరాలను సేకరించి అధ్యయనం చేపట్టారు. ఈ క్రమంలో తేలిందేమిటంటే చాలా చోట్ల చిన్నారుల్లో కోవిడ్‌ను తట్టుకునే శక్తి వచ్చినట్లు నిర్దారించారు. అందువల్ల చిన్నారులపై మూడో వేవ్‌లో వైరస్ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని అభిప్రాయ పడుతున్నారు.
అయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉండే చిన్నారుల పట్ల జాగ్రత్తలు వహించాలని, వారికి పోషకాహారం ఇవ్వాలని సూచిస్తున్నారు. చిన్నారులకు పౌష్టికాహారం ఇవ్వడంతోపాటు కోవిడ్ జాగ్రత్తలను నేర్పించాలి. మాస్కులు ధరించేలా చూడాలి. భౌతిక దూరం పాటించమని చెప్పాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించేలా చూడాలి. వాటిని నేర్పించాలి. దీంతో వారికి కోవిడ్ రిస్క్ ను తగ్గించవచ్చని సూచిస్తున్నారు.