భారత్‌లో కరోనా మూడో వేవ్‌ కూడా వచ్చేందుకు అవకాశం ఉంది.. ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా..

దేశంలో కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ దారుణంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే కోవిడ్‌ మూడో వేవ్‌ కూడా వచ్చే అవకాశం ఉందని ఆల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్) డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా అన్నారు. ఈ మేరకు ఆయన ఓ న్యూస్‌ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. దేశంలో కోవిడ్‌ను కట్టడి చేసేందుకు పలు చోట్ల రాత్రి పూట కర్ఫ్యూలు, వీకెండ్‌ లాక్‌డౌన్‌లు అమలు చేస్తున్నారని, అయితే ఇవి ఏ మాత్రం ప్రభావం చూపడం లేదని, కనుక దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ఒక్కటే మార్గమని అన్నారు.

covid third wave may hit india randeep guleria

దేశంలో కోవిడ్‌ విజృంభిస్తున్నందున అనేక చోట్ల ఆక్సిజన్‌ కొరత తీవ్రంగా ఉందని, బెడ్లు నిండిపోయాయని, వైద్య సదుపాయాలు, సిబ్బంది కొరత ఉందని అన్నారు. కోవిడ్‌ కేసుల సంఖ్య ఇలాగే పెరిగితే వైద్య రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని, అది రాకుండా ఉండాలంటే లాక్ డౌన్‌ విధించాలని, దీంతో కొంత వరకు కోవిడ్‌ను కట్టడి చేయవచ్చని, అలాగే సదుపాయాలను ఏర్పాటు చేసుకునేందుకు సమయం దొరుకుతుందని అన్నారు.

దేశంలో వైద్య రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగు పరచాల్సిన అవసరం ఉందని గులేరియా అన్నారు. అలాగే కోవిడ్‌ చెయిన్‌ను ఆపాలని, వ్యాక్సిన్లను ఎక్కువ మందికి ఇవ్వాలని, దీంతోనే కోవిడ్‌ను కట్టడి చేసేందుకు సాధ్యమవుతుందని అన్నారు. ఇక లాక్ డౌన్‌ను విధించాల్సి వస్తే పేదలు, వలస కార్మికుల గురించి కూడా ఆలోచించాలని, వారికి సహాయం అందజేసే విధంగా లాక్‌డౌన్‌ ఉండాలన్నారు. దేశంలో ప్రస్తుతం ఉన్న కోవిడ్‌ పరిస్థితిని అదుపు చేయాలంటే ఇప్పటి నుంచి కనీసం రెండు వారాల వరకు లాక్‌డౌన్‌ అవసరం అని అన్నారు. యూకే, చైనా వంటి దేశాల్లో లాక్‌డౌన్‌ వల్ల కోవిడ్‌ నియంత్రణలోకి వచ్చిందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.