భారత్‌లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ జనవరి నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉందని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) సీఈవో అదర్ పూనావాలా అన్నారు. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకాలకు చెందిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కు అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేశామని, అందుకు ఈ నెలాఖరు వరకు అనుమతి లభిస్తే.. వచ్చే ఏడాది జనవరి నుంచి దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమయ్యేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.
ది ఎకనామిక్ టైమ్స్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాది అక్టోబర్ వరకు భారత్‌లో అందరికీ వ్యాక్సిన్ పంపిణీ అయ్యే అవకాశం ఉందని, అప్పటి నుంచి దేశంలో సాధారణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని అన్నారు. కాగా తొలి దశలో 20 శాతం మంది భారతీయులకు వ్యాక్సిన్‌ను పంపిణీ చేసేందుకు అవకాశం ఉందని అన్నారు.
డిసెంబర్ 7వ తేదీన ఎస్ఐఐ తాము ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను అత్యవసరంగా ఉపయోగించేందుకు గాను డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)ని అనుమతి కోరింది. అయితే సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్‌కు చెందిన నిపుణుల కమిటీ ఎస్ఐఐతోపాటు భారత్ బయోటెక్ నుంచి వారి వ్యాక్సిన్లకు చెందిన మరింత సమాచారాన్ని కావాలని కోరింది. వ్యాక్సిన్ల సేఫ్టీ, పనితనం తదితర వివరాలను మరింత లోతుగా అధ్యయనం చేయనున్నారు. దీంతో ఈ నెలాఖరు వరకు ఆయా వ్యాక్సిన్లకు అత్యవసర వినియోగానికి గాను అనుమతి లభిస్తుందని భావిస్తున్నారు. మొదటి దశలో భారత్ మొత్తం 30 కోట్ల మందికి రెండు డోసుల వ్యాక్సిన్‌ను పంపిణీ చేయనుంది.