ఏప్రిల్ 5వరకు సిసోదియా జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియాకు కోర్టు విధించిన జ్యుడీషియల్ కస్టడీ ఇవాళ్టితో ముగిసింది. దీంతో ఈడీ సిసోదియాను దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో సిసోదియాను హాజరు పరిచగా.. ఏప్రిల్ 5వరకు సిసోదియాకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ధర్మాసనం ఆదేశాలిచ్చింది. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న తనకు మతపరమైన, ఆధ్యాత్మిక పుస్తకాలు తీసుకునేందుకు అనుమతినివ్వాలని సిసోదియా కోర్టుకు విన్నవించగా.. దరఖాస్తు చేసుకుంటే అంగీకరిస్తామని ధర్మాసనం తెలిపింది.

manish sisodia

మరోవైపు దిల్లీ మద్యం కేసుకు సంబంధించి ఈడీ దర్యాప్తు చేస్తున్న మనీలాండరింగ్ కేసులోనూ బెయిల్ కోసం మంగళవారం రోజున కోర్టును సిసోదియా ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై ఈ నెల 25లోగా స్పందన తెలపాలని ఈడీని న్యాయస్థానం ఆదేశించింది.

మరోవైపు దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ దర్యాప్తునకు తాను పూర్తిగా సహకరిస్తున్నానని  సిసోదియా కోర్టుకు చెప్పారు. తనకు బెయిల్​ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ‘సిసోదియా ప్రజాసేవకుడు. ఆయన విదేశాలకు పారిపోయే ముప్పు లేదు కనుక కస్టడీలో ఉంచాల్సిన అవసరం లేదు.  ప్రస్తుతం ఆయన భార్య అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొడుకు విదేశాల్లో ఉండటం వల్ల ఆమెను చూసుకోవాల్సిన బాధ్యత సిసోదియాపైనే ఉంది. కాబట్టి బెయిల్​ మంజూరు చేయండి’ అంటూ సిసోదియా తరఫు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ వినతిని సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించడంతో న్యాయస్థానం తదుపరి విచారణ మార్చి 24కు వాయిదా పడింది.