ఝార్ఖండ్లో అకస్మాత్తుగా కురిసిన వాన ఆ రాష్ట్ర ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఏకధాటి వర్షంతో ఓవైపు రైతులు.. మరోవైపు సామాన్య ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చే సమయంలో నీటిపాలైందని కర్షకులు కన్నీరుమున్నీరవుతున్నారు.
అకాల వర్షంతో ఝార్ఖండ్ లో దారుణం జరిగింది. పిడుగుపాటుకు గురై నలుగురు చిన్నారులు మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన సాహిబ్ గంజ్ జిల్లాలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రాహ్మహల్ ప్రాంతంలోని రాధానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మామిడి కాయలు కోయడానికి కొందరు పిల్లలు మామిడి తోటకు వెళ్లారు. బలమైన ఈదురు గాలులతో భారీగా వర్షం కురిసింది. దీంతో చిన్నారులు అక్కడే ఉన్న ఓ మామిడి చెట్టు కిందకు వెళ్లారు. అకస్మాత్తుగా పిడుగు పడటం వల్ల నలుగురు మృత్యువాత పడ్డారు. మరొ చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.