కరోనా నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా అన్ని దేశాల్లోనూ కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. మన దేశంలో టీకాల కొరత వల్ల వ్యాక్సినేషన్ నెమ్మదిగా సాగుతోంది. అయితే కోవిడ్ టీకాలను తీసుకుంటున్న వారికి అనేక సందేహాలు కలుగుతున్నాయి. వాటిలో ఒకటి.. టీకా రెండు డోసులు తీసుకున్న తరువాత కూడా వ్యక్తులు ఇతరులకు కరోనా వైరస్‌ను వ్యాప్తి చెందిస్తారా ? రెండు డోసుల టీకా తీసుకున్న వారి నుంచి వైరస్ టీకా తీసుకోని వారికి వ్యాప్తి చెందుతుందా ? అని సందేహిస్తున్నారు. అయితే ఇందుకు నిపుణులు ఏమని సమాధానాలు చెబుతున్నారంటే..?
దేశంలో ప్రస్తుతం రెండు రకాల టీకాలను ఇస్తున్నారు. ఒకటి కోవిషీల్డ్, రెండోది కోవాగ్జిన్. ఏ రకం టీకా తీసుకున్నా సరే మొదటి, రెండో డోసుకు మధ్య విరామం ఇవ్వాల్సి ఉంటుంది. రెండు టీకాలకు భిన్నమైన సమయాన్ని విరామంగా ఇచ్చారు. అయితే టీకా రెండు డోసులు తీసుకున్న తరువాత 2-4 వారాలకు శరీరంలో యాంటీ బాడీలు బాగా తయారవుతాయి. దీంతో వారికి కోవిడ్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఒకవేళ వైరస్ బారిన పడినప్పటికీ వారిలో యాంటీ బాడీలు తయారై ఉండే అవి వెంటనే వైరస్‌ను నాశనం చేస్తాయి. దీంతో ఆ వ్యక్తి నుంచి ఇతరులకు వైరస్ వ్యాపించదు.
అయితే రెండో డోసు తీసుకున్న తరువాత యాంటీ బాడీలు సరిగ్గా ఏర్పడకపోయినా కోవిడ్ నుంచి రక్షణ లభిస్తుంది. అలాంటి వారికి వైరస్ సోకినా స్వల్ప, మధ్యస్థ లక్షణాలతో కోవిడ్ వస్తుంది. వ్యాధి తీవ్రతరం కాదు. వారు త్వరగా కోలుకుంటారు. కానీ అలాంటి వారు ఇతరులకు కోవిడ్‌ను వ్యాప్తి చెందించేందుకు అవకాశం ఉంటుంది. కనుకనే టీకాలను తీసుకున్నప్పటికీ వారు ఇతరులకు వైరస్‌ను వ్యాప్తి చేసే అవకాశాలు కొంత వరకు ఉంటాయి కనుక టీకా తీసుకున్న వారు కూడా మాస్కులను ధరించాలని, భౌతిక దూరం పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో కోవిడ్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని చెబుతున్నారు.