బిహార్‌లో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. దాదాపు 40 మంది మహిళలు ఒకే పేరును తమ భర్త పేరుగా చెబుతున్నారు. చెప్పడమే కాదు ఏకంగా ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేసుకున్నారు. ఇది చూసిన అధికారులు అవాక్కయ్యారు. అసలేం జరిగిదంటే..?
బిహార్‌లో ప్రస్తుతం రెండో దశ కులగణన జరుగుతోంది. కులం, విద్య, ఆర్థిక స్థితి, కుటుంబ స్థితిగతులు వంటి విషయాలు తెలుసుకునేందుకు.. ప్రభుత్వ సిబ్బంది ఇంటింటికి తిరుగుతున్నారు. అందులో భాగంగానే అర్వల్ జిల్లాలోని ఓ రెడ్‌లైట్ ఏరియాలో నివాసం ఉంటున్న వారి వివరాలు సేకరించేందుకు ప్రభుత్వ ఉద్యోగులు వెళ్లారు. అక్కడ సుమారు 40 మంది మహిళలు.. తమ భర్త పేరు రూప్‌చంద్ అని చెప్పారు. చాలా మంది పిల్లలు సైతం తమ తండ్రి పేరు రూప్‌చంద్ అని తెలిపారు.
దీని గురించి అధికారులు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది.. ఆ రెడ్‌లైట్ ఏరియాలో రూప్‌చంద్ అనే డ్యాన్సర్ ఉన్నాడు. అతడు చాలా ఏళ్లుగా పాటలు పాడుతూ.. డాన్స్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడంటే ఆ ఏరియా మహిళలకు వల్లమాలిన అభిమానం. అందుకే అతడిపై అభిమానంతోనే మహిళలు రూప్‌చంద్ పేరును.. తమ భర్త పేరుగా చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో ఉండేవారికి కులం అంటూ ఏదీ లేదని అధికారులు చెబుతున్నారు.