చోరీ కేసులో నిందితుడైన వరుడి పెళ్లి జరుగుతుండగా పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఈ గొందరగోళ పరిస్థితుల్లో వరుడి సోదరుడిని వధువు పెళ్లాడింది. విస్తూపోయే ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లాలో జరిగింది. ఒక మద్యం షాపు, క్యాంటీన్ నుంచి 35 డబ్బాల్లో ఉన్న మద్యం సీసాలు, ఇతర వస్తువులు చోరీ అయ్యాయి. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు జరిపారు. చోరీ జరిగిన సంఘటనా స్థలం నుంచి ఒక బైక్, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వాటి ఆధారంగా దొంగతనానికి పాల్పడిన నిందితుడ్ని ఫైజల్‌గా గుర్తించారు.
మరోవైపు ఓ యువతితో ఫైజల్ పెళ్లి జరుగుతుండగా.. పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పెళ్లి తంతు మధ్యలో ఉండగానే అతడినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. దీంతో ఫైజల్ కుటుంబ సభ్యులు, బంధువులు ఆ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు.
కాగా, చోరీ గురించి ఫైజల్‌ను పోలీసులు ప్రశ్నించగా.. నేరం చేసినట్లు అతడు ఒప్పుకున్నాడు. అయితే ఈ గందరగోళ పరిస్థితుల్లో పెళ్లి వేదిక వద్ద వధువు ఒంటరిగా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో ఆమెను పెళ్లి చేసుకునేందుకు వరుడి అన్నయ్య ముందుకు వచ్చాడు. ఇరు కుటుంబాలు దీనికి అంగీకరించడంతో చివరికీ వారిద్దరికీ పెళ్లి జరిగింది.