లాక్‌డౌన్‌… మద్యం ప్రియుల ముందు జాగ్రత్త

-

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా తీవ్ర రూపం దాలుస్తుంది. ఢిల్లీలో గత నాలుగు రోజులుగా రోజుకు దాదాపు 25వేల కేసుల వరకు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడిపై దృష్టి సారించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరు రోజుల పాటు పూర్తి లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రకటించారు. నేటి (సోమవారం) రాత్రి 10 గంటల నుంచి వచ్చే సోమవారం ఉదయం 5 గంటల వరకూ లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుందని స్పష్టం చేసారు.

కాగా లాక్ డౌన్ నేపథ్యంలో నిత్యావసరాలు, వైద్య సేవలు మినహా అన్ని సేవలు నిలిచిపోనున్నాయి. దీంతో మద్యం దుకాణాలు ఆరు రోజుల పాటు మూతపడుతుండడంతో మందుబాబులు ముందే అప్రమత్తమయ్యారు. లాక్‌డౌన్‌ ప్రకటనతో మద్యం దుకాణాల ముందు బారులు తీరారు. పెద్ద ఎత్తున క్యూలో నిలుచున్నారు. కొన్ని ప్రాంతాల్లో మాస్కులు కూడా ధరించకుండా, ఎలాంటి సామాజిక దూరం పాటించకుండా గుంపులు గుంపులుగా మద్యం దుకాణాల ముందు నిలబడడం మరింత ఆందోళన కలిగిస్తోంది.

కాగా గ‌త ఏడాది రాత్రికి రాత్రే దేశంలో లాక్‌డౌన్ విధించిన విషయం తెల్సిందే. దీంతో ఆ సమయంలో మందు దొర‌క‌క‌ అల్లాడిపోయిన మందుబాబులు ఈ సారి ముందే అప్రమత్తమయ్యారు. ఢిల్లీలో వైన్ షాపుల ముందు క్యూల‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. కాగా దాదాపు వారం రోజులు మద్యం దుకాణాలు మూతపడుతుండడంతో అటు దుకాణాల యజమానులు కూడా వీలైనంత ఎక్కువగా మద్యం విక్రయించే పనిలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news