హిమాచల్ ప్రదేశ్ లో అధికార బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హిమాచల్ ప్రదేశ్ లో ఒక పార్లమెంట్, మూడు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అయితే నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. బీజేపీ ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ… ఒక్క సీటు కూడా గెలువలేకపోయింది. మండి లోక్ సభ నియోజకవర్గం నుంచి దివంగత ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ భార్య కాంగ్రెస్ అభ్యర్థి ప్రతిభాసింగ్, బీజేపీ అభ్యర్థి కుషాల్ చంద్ ఠాకూర్ పై ఘనవిజయం సాధించారు. ఇదే విధంగా ఫతేపూర్, అర్కీ, జుబ్బాయి-కొత్కై మూడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది.
కాగా వచ్చే ఏడాది 2022 ఫిబ్రవరిలో హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఎన్నికల ముందు బీజేపీ పార్టీకి ఎదురుగాలి వీచింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలు రాబట్టింది. ప్రస్తుతం ఉప ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే.. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేఖత ఎదురైనట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుత గెలుపుతో కాంగ్రెస్ వచ్చే ఎన్నికల కోసం మరింత ఉత్సాహంగా పనిచేసే అవకాశం ఏర్పడింది.