జననేతగా అందరివాడుగా పరిపాలన సాగిస్తున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యమిస్తున్నారు. యోగీ తీసుకుంటున్న నిర్ణయాలతో అధికారులు ఇరుకున పడుతున్నారు. ప్రజల పట్ల నిర్లక్ష్యం వహించినా,వారి సమస్యలు వినకుండా అశ్రద్ధవహించినా కఠిన చర్యలుంటాయని యోగీ హెచ్చరించిన నేపథ్యంలో అక్కడి అధికారులు తలలు పట్టుకుంటున్నారు.ప్రజాసమస్యలను వినకుండా పదే పదే అనవసరంగా కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటే సహించేదిలేదని ముఖ్యమంత్రి హెచ్చరించారు.
డ్యూటీ టైమ్‌ని పూర్తిగా ప్రజాసేవకు వినియోగించాలని అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి.రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన ప్రజల సమస్యలను వినిన తరువాత త్వరగా పరిష్కరించేలా అధికారులకు సూచనలు చేశారు. అధికారులు నిర్ణీత సమయానికే డ్యూటీకి రావాలని చెప్పిన యోగీ భోజనానికి ఇంటికి వెళ్లవద్దని సూచించారు. కార్యాలయంలోనే భోజనం చేయాలని చెప్తూ వివిధ శాఖలకు సంబంధించి ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా సకాలంలో విని పరిష్కరించాలని ఆదేశించారు.
ప్రజల ఫిర్యాదులు, వారి కేసులను పోలీస్ స్టేషన్ స్థాయిలోనే పరిష్కరించేలా చూడాలని జనతా దర్శన్‌లో ఉన్న డీజీపీ విజయ్‌కుమార్‌కు యోగి కఠినమైన ఆదేశాలు ఇచ్చారు. తద్వారా పోలీసులపై ప్రజల్లో నమ్మకం మరింత పెరుగుతుందని చికిత్స కోసం ప్రభుత్వం వద్ద నిధుల కొరత లేదని యోగి అన్నారు.నిరుపేదలకు ఉచితంగా చికిత్స అందించాలని ఆదాయానికి సంబంధించిన అంశాలను కూడా పారదర్శకంగా క్లియర్ చేయాలని ఆదేశించారు. అటవీ అధికారుల బదిలీలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తపరిచిన ముఖ్యమంత్రి ట్రాన్స్‌ఫర్ ఆర్డర్లను వెనక్కి తీసుకోవాలని సూచించారు.