డ్రాగన్ దేశం చైనా మరోసారి విషం కక్కింది. అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ పదేపదే అదే పాట పాడుతోంది. చైనావి అసంబద్ధమైన, హాస్యాస్పదమైన వ్యాఖ్యలంటూ భారత్ తోసిపుచ్చుతున్న డ్రాగన్ మళ్లీ మళ్లీ అదే మాట మాట్లాడుతోంది. పదే పదే అదే పాట పాడినంత మాత్రాన అవాస్తవం వాస్తవం కాదని, అరుణాచల్ చైనా భూభాగం కాదని భారత్ స్పష్టం చెప్పిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో మరోసారి నోరుపారేసుకున్న చైనా ఈ సారి కాస్త నోరు పెంచి, అరుణాచల్‌ను ఇండియా అన్యాయంగా ఆక్రమించుకొందని వ్యాఖ్యానించింది. భారత్, చైనాల మధ్య సరిహద్దు వివాదం ఎన్నడూ పరిష్కారం కాలేదని, గతంలో అరుణాచల్ చైనాలో భాగంగా ఉండేదని, ఆ ప్రాంతంలో చైనా పరిపాలన కూడా సాగేదని ఆ దేశ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ అన్నారు. దాన్ని 1987లో భారత్ ఆక్రమించుకొని అరుణాచల్ ప్రదేశ్‌గా రూపొందించుకుందని ఆరోపించారు.
చైనా ఇలా మాట్లాడటం గత నెల రోజుల్లో ఇది నాలుగోసారి. అయితే, చైనా వ్యాఖ్యలపై భారత్ దీటుగా బదులిస్తోంది. ఇది కొత్త విషయం కాదని, చైనా ఆరోపణలు చేస్తూనే ఉంటుందని, అవి మొదటినుంచీ హాస్యాస్పదంగానే ఉన్నాయని, ఇప్పుడు కూడా అంతేనని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇటీవల దీటుగా బదులిచ్చారు.