బ్రేకింగ్: ఫిబ్రవరిలో ఇండియా కరోనా వ్యాక్సిన్: ఐసిఎంఆర్

భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ ఊహించిన దాని కంటే ముందే రావొచ్చు అని ఐసిఎంఆర్ సీనియర్ శాస్త్రవేత్త ఒకరు చెప్పారు. ఇప్పటి వరకు వచ్చిన నివేదికలు, చేసిన పరిక్షల ప్రకారం ఈ వ్యాక్సిన్ సురక్షితంగా ఉందని, ఫిబ్రవరి నాటికి కచ్చితంగా వ్యాక్సిన్ ని అందిస్తామని ధీమా వ్యక్తం చేసారు. ప్రభుత్వం సారధ్యంలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) తో కలిసి కోవాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న భారత్ బయోటెక్ అనే ప్రైవేటు సంస్థ, ఈ టీకాను వచ్చే ఏడాది రెండవ త్రైమాసికంలో మాత్రమే విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలిపింది.

టీకా పని తీరు బాగుంది అని… వచ్చే ఏడాది ప్రారంభం, ఫిబ్రవరి లేదా మార్చి నాటికి వస్తుంది అని భావిస్తున్నట్టు సీనియర్ ఐసిఎంఆర్ శాస్త్రవేత్త రజనీ కాంత్ రాయిటర్స్ తో చెప్పారు. కోవిడ్ వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ లో ఈయన సభ్యుడు గా ఉన్నారు. గురువారం ఢిల్లీలో ఈ వ్యాఖ్యలు చేసారు. ఐసిఎంఆర్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్, పాలసీ, ప్లానింగ్, కోఆర్డినేషన్ సెల్ అధినేత అయిన రజనీ కాంత్ మాట్లాడుతూ, మూడవ దశ ట్రయల్స్ ముగిసేలోపు కోవాక్సిన్ షాట్లను ప్రజలకు ఇవ్వవచ్చా అనేది ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించాల్సిన అవసరం ఉంది అన్నారు.