లోక్సభ ఎన్నికలకు నగారా మోగింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో రాష్ట్రంలో ధరణి పోర్టల్ పెండింగ్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ నిలిచిపోయింది. ధరణిలో 2.46 లక్షల పెండింగ్ దరఖాస్తులు ఉండగా ఈనెల 1వ తేదీ నుంచి ప్రభుత్వం వాటి పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) లాగిన్ నుంచి పెండింగ్ దరఖాస్తులను తహసీల్దార్లు, ఆర్డీవోలు, కలెక్టర్లకు పంపుతున్నారు. దీనికి అనుగుణంగా పోర్టర్లలో లాగిన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ దశలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో ఈ ప్రక్రియ ఆగిపోయింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ధరణి స్పెషల్ డ్రైవ్ నిలిపివేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
రాష్ట్రవ్యాప్తంగా 1.10 లక్షల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారించి దస్త్రాలతో పోల్చి పరిశీలన పూర్తి చేశారు. పరిష్కరించిన దరఖాస్తులను పోర్టల్లో నిక్షిప్తం చేస్తూ వస్తున్నారు. మరో 50 వేలు వివిధ దశల్లో ఉన్నాయి. డిజిటల్ సంతకాలు పూర్తయిన ఖాతాలకు మాత్రమే పట్టాదారు పాసుపుస్తకాలు రానుండగా.. రాష్ట్ర స్థాయిలో ఎన్ని సంతకాలు పూర్తయ్యాయనే సమాచారం ఇంకా అందలేదని రెవెన్యూ వర్గాలు తెలిపాయి.