భారత్‌లో పదేళ్లకోసారి నిర్వహించే జనాభా గణన వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోపు చేపట్టే అవకాశం లేనట్లు తెలుస్తోంది. ఈసారి 2020 ఏప్రిల్ 1 – సెప్టెంబరు 30 మధ్య ఈ లెక్కింపును చేపట్టాల్సి ఉండగా కొవిడ్ కారణంగా ఆ కార్యక్రమం నిరవధికంగా వాయిదాపడిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు.
2024 ఏప్రిల్-మే మధ్య లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను ఎన్నికల సంఘం చేపట్టనుంది. వచ్చే అక్టోబరు నుంచి ఈసీ చేపట్టే కార్యక్రమాల్లో, జనాభా గణన ప్రక్రియలోనూ ఒకే సిబ్బంది పాల్గొనాల్సి ఉంటున్నందున ఆ సమయంలో జనాభా లెక్కింపును చేపట్టడానికి అవకాశం ఉండదని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్నికల తర్వాతే జనాభా లెక్కింపు ఉండే అవకాశం ఉందని చెప్పారు.
ఈసారి డిజిటల్ జనాభా గణనగా ఉంటుంది. పౌరులు సొంతంగా వివరాలను సమర్పించే అవకాశాన్ని కల్పిస్తారు. ఇందుకు సంబంధించిన స్వీయగణన పోర్టల్‌ను సంబంధిత యంత్రాంగం రూపొందించింది.