భారత్-చైనా సంబంధాలు దెబ్బతినడానికి కారణం డ్రాగన్ ఏకపక్ష నిర్ణయాలే : జైశంకర్

-

డ్రాగన్‌ ఏకపక్ష నిర్ణయాల వల్లే భారత్‌ – చైనా ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ అన్నారు. సరిహద్దుల విషయంలో చైనా ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తోందని చెప్పారు. కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

‘‘రెండు చేతులు కలిపితేనే చప్పట్లు కొట్టగలం. అదే విధంగా రెండు దేశాల నడుమ ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడాలంటే పరస్పర అంగీకారం, సున్నితత్వం, గౌరవం ఉండాలి. ఈ విషయం చైనాకు అర్థమయ్యేలా చేయడానికి కృషి చేస్తున్నాం. ఇరుదేశాలు కలిసి నిర్ణయాలు తీసుకుంటేనే సంబంధాలు మెరుగుపడతాయి’’ అని జైశంకర్‌ అన్నారు. కశ్మీర్‌ సరిహద్దు విషయంలోనూ పాకిస్థాన్‌తో ఇదే రీతిలో సమస్యను పరిష్కరించుకోవడానికి భారత్‌ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.

‘‘భారత్‌ను శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచం గుర్తించింది. అమెరికా-రష్యాలతో భారత్‌కు మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి. రష్యాతో ఉన్న బంధం…అగ్రరాజ్యంతో ఉన్న సంబంధానికి ఆటంకం కలిగించడం లేదు. రష్యాతో చెలిమి వల్ల మన దేశం ఆర్థికంగా పురోగమిస్తోంది’’ అని జైశంకర్‌ అభిప్రాయపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news