అమెజాన్‌పై క‌న్న‌డిగుల ఆగ్ర‌హం.. నిషేధించాల‌ని పిలుపు..

ప్ర‌ముఖ ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ (Amazon) మ‌రోసారి వివాదాల్లో చిక్కుకుంది. క‌ర్ణాట‌క రాష్ట్రానికి చెందిన జెండాను పోలిన బికినీల‌ను అమ్ముతూ ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల ఆగ్ర‌హానికి గుర‌వుతోంది. అమెజాన్‌కు చెందిన కెన‌డా సైట్‌తోపాటు యూకే, జ‌పాన్‌, మెక్సికోల‌లోనూ ఆ బికినీల‌ను అమెజాన్ విక్ర‌యిస్తోంది. దీంతో అమెజాన్‌ పై క‌న్న‌డిగులు పెద్ద ఎత్తున ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

క‌ర్ణాట‌క రాష్ట్రానికి చెందిన జెండాను బికినీల రూపంలో అమ్ముతున్నారంటూ మొద‌ట క‌న్న‌డ ర‌క్ష‌ణ వేదికె (కేఆర్‌వీ)కి చెందిన ప్ర‌వీణ్ శెట్టి సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో స్పందించిన క‌న్న‌డిగులు వెంట‌నే అమెజాన్ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని, లేదంటే ఆ సంస్థ‌ను నిషేధించాల‌ని పిలుపునిస్తున్నారు. ఇక ఆ రాష్ట్ర మంత్రి అర‌వింద్ లింబ‌వ‌లి కూడా ఈ విష‌యంపై స్పందించారు. అమెజాన్ వెంటనే ఆ బికినీల‌ను తొల‌గించాల‌ని, త‌రువాత క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని, లేదంటే చ‌ట్ట ప‌ర్యంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. ఈ మేర‌కు ఆయ‌న అమెజాన్ కెన‌డా సంస్థ‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.

కాగా స‌ద‌రు బికినీని BKDMHHH Women’s Flag of Karnataka Original Design Slim Fit Tie Side Laces Triangle Chic Trimmer for Girl’s అనే పేరిట అమెజాన్ విక్ర‌యిస్తోంది. ఆ బికినీ క‌ర్ణాట‌క రాష్ట్ర జెండాను పోలి ఉంది. నిజానికి అమెజాన్‌లో ఇలా దుస్తులు అమ్మ‌డం కొత్తేమీ కాదు. గ‌తంలో ఓ సారి హిందూ దేవుళ్లు, దేవత‌ల‌కు చెందిన దుస్తుల‌ను అమ్మి భంగ‌పాటుకు గురై క్ష‌మాప‌ణ‌లు చెప్పింది. ఈ క్ర‌మంలోనే స‌రిగ్గా అలాంటి విష‌యంలోనే అమెజాన్ మ‌రోసారి విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటోంది. ఇక ఇటీవ‌ల గూగుల్ కూడా క‌ర్ణాట‌క రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సి వ‌చ్చింది. క‌న్న‌డ భాష గురించి గూగుల్‌లో సెర్చ్ చేస్తే అత్యంత నీచ‌మైన భాష అని రిజ‌ల్ట్ వ‌చ్చింది. దీంతో క‌న్న‌డిగులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌గా గూగుల్ స్పందించి క్ష‌మాప‌ణ‌లు చెప్పింది. ఆ రిజ‌ల్ట్‌ను తొల‌గించింది. ఇక ఇప్పుడు అమెజాన్ విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటోంది. మ‌రి దీనిపై అమెజాన్ స్పందిస్తుందా, లేదా అన్న‌ది చూడాలి.