పంజాబ్‌లో విజయం, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయమైన ఓట్లతో జాతీయ పార్టీ హోదాను సొంతం చేసుకున్న యాప్.. మరికొన్ని రాష్ట్రాల ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ఎన్నికలు జరిగే కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో పర్యటనకు ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ సిద్ధమవుతున్నారు. ఈ పర్యటన సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో ఆప్ ఎన్నికల శంఖారావాన్ని పూరించి పార్టీ శ్రేణుల్ని సమాయత్తం చేయబోతున్నారు. ఇప్పటికే కేజ్రీవాల్ పర్యటన తేదీలు ఖరారైనట్టు సమాచారం.
మార్చి 4న కర్ణాటకలో కేజ్రీవాల్ పర్యటించి ఎన్నికల సమరశంఖాన్ని పూరించే అవకాశం ఉన్నట్టు సమాచారం. మార్చి 5న కాంగ్రెస్ పాలిత రాష్ట్రం ఛత్తీస్‌గఢ్; మార్చి 13న రాజస్థాన్; మార్చి 14న బీజేపీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లో ఆప్ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనుంది. గతేడాది పంజాబ్‌లో అపూర్వ విజయం సాధించిన ఆప్.. గతంలో గోవా ఎన్నికల్లో రెండు సీట్లు, గుజరాత్ ఎన్నికల్లో ఐదు సీట్లు, 13శాతం ఓట్లతో తన సత్తా చాటింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జరగబోయే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఎలాంటి ప్రభావం చూపబోతుందనే అంశం ఆసక్తికరంగా మారింది.