లక్ అంటే ఇదేరా.. అప్పులపాలై ఇల్లు అమ్మే ముందు రూ.కోటి లాటరీ..!

-

కొందరు ఎంత కష్టపడినా అనుకున్నది సాధించలేరు. మరికొందరు ఎక్కువ కష్టపడకుండానే కావాల్సింది పొందుతారు. అందుకే ఎంత శ్రమించినా పిడికెడంత అదృష్టం లేకపోతే అంతా వృథాయే అంటుంటారు. కానీ కొందరికి మాత్రం అదృష్టం సరైన సమయంలో వరిస్తుంది. జీవితంలో ఇక పడిపోయాం ఇంకేం మిగల్లేదనుకునే సమయంలో లక్ ఎంట్రీ ఇస్తుంది. వారి జీవితాన్నే మార్చేస్తుంది. అలాంటి ఓ సంఘటన కేరళలో జరిగింది. అదేంటో చూడండి మరి..
అదృష్టం ఎప్పుడు ఎవరిని ఏరూపంలో వరిస్తుందో ఎవ్వరమూ చెప్పలేం. కొందరికి అలా కలిసొస్తుందంతే. కేరళలోని కొయ్‌కోడ్‌లో తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోయిన వ్యక్తిని అదృష్టం లాటరీ రూపంలో వరించింది. అప్పులు తీర్చేందుకు తన కలల ఇంటిని అమ్మడానికి కొద్ది గంటల ముందే ఓ వ్యక్తికి లాటరీలో ఏకంగా రూ.కోటి జాక్‌పాట్ తగలడంతో అతడి జీవితమే మారిపోయింది.
అసలేం జరిగిందంటే..కేరళలోని కొయ్‌కోడ్‌కు చెందిన మహమ్మద్‌ బవ (50 ఏళ్లు) పెయింటర్‌గా పని చేస్తున్నాడు.‌ అతడికి భార్య, నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. ఎనిమిది నెలల క్రితమే 2వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటిని ఎంతో ఇష్టంతో కట్టుకున్నాడు. అయితే, తన ఇద్దరు కుమార్తెల పెళ్లిళ్లు.. తన కుమారుడు నిజాముద్దీన్‌ను ఖతార్‌ పంపేందుకు బ్యాంకులు, బంధువుల నుంచి దాదాపు రూ.50లక్షల వరకు రుణం తీసుకొని తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. వాటిని తీర్చేందుకు ఇంటిని రూ.40లక్షలకు విక్రయించేందుకు సిద్ధమైన బవ.. సోమవారమే కొంత మొత్తాన్ని అడ్వాన్సుగా తీసుకున్నాడు.
తమకు ఉన్న ఒకే ఒక్క ఆస్తి ఈ ఇల్లేనని.. దాన్ని అమ్మేశాక కుటుంబంతో కలిసి అద్దె ఇంటికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్టు బవ తెలిపినట్టు స్థానిక మీడియా పేర్కొంది. అయితే, తన స్నేహితులు ఎవరూ తనకు సాయం చేయకపోవడంతో జాక్‌పాట్‌ తగులుతుందన్న ఆశతో లాటరీ టిక్కెట్లు కొంటుండేవాడు. ఇందులో భాగంగా తాజాగా లాటరీ డ్రా తీయగా తనకు జాక్‌పాట్ తగిలిందన్న విషయం బవకు తెలియడంతో అతడి ఆనందానికి అవధుల్లేవు. లాటరీ మొత్తంలో పన్నులన్నీ మినహాయించగా బవ చేతికి రూ.63లక్షలు అందనుంది. అయితే, ఇంటిని కొనుగోలు చేసేందుకు సిద్ధం కావడంతో ఈరోజు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి రాగా.. విక్రయించేందుకు అతడు విముఖత వ్యక్తంచేసినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news