దేశవ్యాప్తంగా సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. ఆదివారం రోజున భోగి, లోహ్రీ పండుగలను దక్షిణ, ఉత్తర భారతదేశ ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. మరోవైపు భోగి సందర్భంగా ఉదయాన్నే ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు తెల్లవారుజామునే ఇళ్ల ముందు రంగు రంగుల రంగవళ్లులను రూపొందించారు.
ఇక ఇవాళ సంక్రాంతి సందర్భంగా మరోసారి తెలుగు లోగిళ్లు రంగవళ్లులతో కళకళలాడుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా ఇవాళ శబరిమలలో మకరజ్యోతి దర్శనం ఉండనుంది. ఈ నేపథ్యంలో శబరిమలకు భారీగా అయ్యప్ప స్వాములు, సాధారణ భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రాంగణంలోని క్యూలైన్లలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. భక్తులకు అసౌకర్యం కలగకుండా కేరళ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. దర్శనం కోసం కొందరు అయ్యప్ప స్వాములు ఆలయం బయటే నిద్రిస్తున్నారు. మకర జ్యోతి దర్శనం సోమవారం సాయంత్రం ఉంటుందని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డ్ తెలిపింది. ఇవాళ సన్నిధానంలో స్వామివారికి తిరువాభరణం, దీపారాధన ఉంటాయని వెల్లడించింది. ఈనెల 20న పూజల అనంతరం దేవాలయాన్ని మూసివేయనున్నట్లు పేర్కొంది.