ఒడిశా రైలు ప్రమాద ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాని మోదీపై రాజ్యసభలో ప్రశ్నల వర్షం కురిపించారు. రైల్వేలను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దకుండా.. ప్రజలకు అనేక సమస్యలు సృష్టిస్తోందని ఆరోపించారు. రైల్వే భద్రతపై సామాన్యులు ఇప్పటికీ ఆందోళనగానే ఉన్నారని అన్నారు. రైల్వేల్లో భద్రతపై ఆ శాఖ మంత్రి చేసిన ప్రకటనలన్నీ అవాస్తవాలని తేలిపోయాయని అన్నారు.
“తాజా ప్రమాదం జరిగిన ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో 8278 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సుదీర్ఘ పని గంటల వల్ల లోకో పైలట్లపై భారం పడుతోంది. సిబ్బంది లేకపోవడం వల్ల లోకో పైలట్లతో ఎక్కువసేపు పని చేయించుకుంటున్నట్లు ఇటీవలే రైల్వే బోర్డు తెలిపింది. రైల్వే సేఫ్టీ కమిషన్ సిఫార్సులను పట్టించుకోకపోవడంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ విమర్శలు గుప్పించింది. పట్టాలు తప్పుతున్న ఘటనలు జరుగుతున్నా.. సరైన టెస్టింగ్ నిర్వహించకపోవడాన్ని కాగ్ తన రిపోర్టులో ప్రస్తావించింది. కవచ్ వ్యవస్థ 4 శాతం మార్గాలకే ఎందుకు పరిమితమైంది? ఈ సమస్యలను గుర్తించేందుకు మీరు, రైల్వే మంత్రి సిద్ధంగా లేరు.”
– మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు