రాజకీయాల్లో ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకు అనేక మార్గాలు ఉంటాయి. వాటిలో ఇవీ అవీ అని చెప్పడానికి ఏమీ ఉండవు. ఏది అప్పటికి వర్కవుట్ అయితే.. దానిని అనుసరించడం అనేది రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉంది. గతంలో అన్నగారు నందమూరి తారకరామారావు ఉమ్మడి ఏపీలో టీడీపీని స్థాపించి నప్పుడు చైతన్యరథంతో ప్రజల వద్దకు వెళ్లారు. తాను ఎందుకు రాజకీయాల్లోకి వచ్చానో వివరించారు. అయితే, ఈ సమయంలో ఆయన అనేక `వేషాలు` వేశారు. ఫక్తు కాషాయం కట్టారు. పంచె కట్టుతో అలరించారు. అదేవిధంగా వివేకానందుని వేషం వేశారు. ఇలా ఏరూపం దాల్చిన బహుముఖ రూపాల్లో ప్రజలను ఆకర్షించి వారి ఓట్లను దండుకోవడమే పనిగా ముందుకు సాగారు.
ఎవరి విద్య వారిది. గత ఏడాది ఎన్నికల ముందు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇదే తరహా వ్యూహానికి పదును పెట్టారు. అక్కడెక్కడో ఉన్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రతిపక్ష నేత మాయావతిని తీసుకువచ్చారు. ఆమెను ఓ నాలుగు రోజులు ఏపీలో ఉంచారు. వివిధ సభలకు తీసుకువచ్చి.. వేదికలపై `పాదాభివందనా`లు చేశారు. ఇదీ ఒకరకమైన రాజకీయ వేషమే! అనే విమర్శలు వచ్చినా. పవన్ పట్టించుకోలేదు. ఇక, ఇప్పుడు ఈ తరహా వేషాలు.. రాష్ట్రాలు దాటి.. దేశరాజధానిని చేరింది. కీలకమైన ఇద్దరు నాయకులు తమ `వేషాలను` మార్చుకుంటున్నారు. వీరిలో ఒకరు కాంగ్రెస్ నాయకుడు, మాజీ సారథి(ఇటీవలే సోనియా పగ్గాలు చేపట్టారు) రాహుల్ గాంధీ.
ఇంకొకరు దేశాన్నేలుతున్న ప్రధాని నరేంద్ర మోడీ! ఈ ఇద్దరూ కూడా ఇప్పుడు తమ వేషాలను మార్చుకుంటున్నారు. నిజానికి రాహుల్.. రాజకీయంగా తనకు తాను గెలుస్తున్నా.. పార్టీని గెలిపించలేక పోతున్నారు. ప్రజల్లో హవా సంపాయించుకోలేక పోతున్నారు. దీంతో ఆయన తన తండ్రి రాజీవ్‌ను తలపించేలా కట్టుబొట్టులను మార్చుకుంటున్నారు. నిజానికి రాహుల్ చాలా స్లిమ్‌గా ఉంటారు. పక్కవెంట్రుకలు చెవుల మీదకు రానివ్వరు. జుట్టును కొంచెం పైకిదువ్వుతారు. కానీ, ఇప్పుడు రాజీవ్ గాంధీ మాదిరిగా జుట్టును చెవులపైకి సాగదీస్తున్నారు. అదేవిధంగా జుట్టును పెంచి పక్కకు దువ్వుతున్నారు. గతానికి భిన్నంగా ఇప్పుడు రాహుల మారుస్తున్న వేషం.. చూశాక.. రాజీవ్ గాంధీ గుర్తుకు వస్తున్నారనే వ్యాఖ్యలు కాంగ్రెస్‌లోనే కాకుండా అన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.
ఇక, ప్రధాని నరేంద్ర మోడీ కూడా తన వేషంలో మార్పులు చూపిస్తున్నారు. గడ్డాన్ని నిలువుగా పెంచుతున్నారు. అదేవిధంగా జుట్టును వెనుక సాగదీస్తున్నారు. అలాగే.. మీసం కూడా పక్కకు దువ్వుతున్నారు. మేధావిగా కనిపిస్తున్నారు. ఈ వేషధారణ అచ్చు.. రవీంద్రనాథ్ ఠాగూర్‌ను పోలి ఉందని ఇటీవల సోషల్ మీడియాలో కామెంట్లు హల్‌చల్ చేశాయి. ఇలా ఇద్దరు దేశనాయకులు కూడా తమ వేషాన్ని మార్చడం వెనుక ఉన్న అంతరార్థం ఒక్కటే.. ప్రజలను మెప్పించడం, తమవైపు తిప్పుకోవడం. త్వరలోనే పశ్చిమ బెంగాల్ , బిహార్ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరు నాయకులు తమ ఆహార్యాలను మార్చుకుంటున్నారనే వాదన ఉంది. మరి వీరి అభిలాష నెరవేరేనా?! చూద్దాం!!