తిరుమల ఆలయ పెద్దజీయర్ స్వామికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన్ను చెన్నై అపోలోకి అధికారులు తరలిస్తున్నారని సమాచారం. పెద్దజీయర్ స్వామికి కరోనా పాజిటివ్ అని తేలడంతో టీటీడీ అర్చకులలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇప్పటికే 18 మంది అర్చకులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మెరుగైన వైద్య చికిత్స కోసం అర్ధరాత్రి చెన్నై అపోలోకు తరలించారు. కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో మార్చి 20న తిరుమల దేవస్థానాన్ని మూసివేశారు.
భక్తుల దర్శనాలను నిలిపివేసి, స్వామివారి నిత్య కైంకర్యాలను కొనసాగించారు. అయితే దేశవ్యాప్తంగా లాక్డౌన్ నిబంధనలను సడలించడంతో సుమారు 80 రోజుల తర్వాత.. జూన్ 11న శ్రీవారి ఆలయాన్ని తెరిచారు. అప్పటి నుంచి భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం కల్పిస్తున్నారు. అయితే ఆలయంలో పనిచేస్తున్న 15 మంది అర్చకులతో సహా 140 మందికి కరోనా సోకింది. ఈ నేపధ్యంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇటీవల అర్చకులతో అత్యవసర సమావేశం నిర్వహించి 60 ఏళ్లు పై బడిన వారు స్వామి వారి సేవకు కొద్ది రోజులు దూరంగా ఉండాలని సూచించారు.