గతేడాది కరోనా లాక్‌డౌన్ కారణంగా ఎన్నో లక్షల మంది ఉద్యోగాలను కోల్పోయారు. తరువాత లాక్ డౌన్ ఆంక్షలను సడలిస్తూ వచ్చే సరికి కంపెనీలు, పరిశ్రమలు మళ్లీ కార్మికులు, ఉద్యోగులను తీసుకోవడం మొదలు పెట్టాయి. దీంతో క్రమంగా ఉద్యోగాల రేటు కూడా పెరిగింది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారీ ఎత్తున ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు.
సెంటర్ ఆఫ్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) విడుదల చేసిన నివేదిక ప్రకారం ఒక్క ఏప్రిల్ నెలలోనే దేశవ్యాప్తంగా ఏకంగా 73.5 లక్షల మంది ఉద్యోగాలను కోల్పోయారని వెల్లడైంది. జనవరిలో ఉద్యోగాలను కలిగి ఉన్నవారి సంఖ్య 40.07 కోట్లు ఉండగా మార్చి నెల వరకు అది 39.08 కోట్లకు చేరుకుంది. అంటే అంత మంది ఉద్యోగాలను కోల్పోయారని అర్థం.
ఇక దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ లేకపోయినప్పటికీ అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌తోపాటు కర్ఫ్యూలను అమలు చేస్తున్నారు. దీంతో అనేక వ్యాపార, వాణిజ్య సముదాయాలు, పరిశ్రమలు మూత పడ్డాయి. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగానే ఇలా జరిగింది. దీంతో లక్షల మంది ఉద్యోగాలను కోల్పోయారు. కాగా ఉద్యోగాలను కోల్పోయాక వాటి కోసం వెదకని వారి సంఖ్య మార్చి నెలలో 1.60 కోట్లు ఉండగా అది ఏప్రిల్ నెలలో 1.94 కోట్లకు చేరుకుంది. కోవిడ్ వల్ల అనేక వ్యాపార, వాణిజ్య సముదాయాలు, పరిశ్రమలు మూత పడడంతో ఇప్పుడప్పుడే ఉద్యోగాలు రావు కనుక చాలా మంది ఉద్యోగాలను వెతుక్కోవడం లేదని స్పష్టమవుతుంది. అయితే ఇది ఇలాగే కొనసాగితే రానున్న 2-3 నెలల్లో గడ్డు పరిస్థితులు వస్తాయని నిపుణులు అంటున్నారు. ఇది ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తుందంటున్నారు.