మహారాష్ట్రలో ఇప్పటికే కఠినమైన ఆంక్షలను విధించి అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కోవిడ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండడంతో లాక్‌డౌన్ లాంటి ఆంక్షలను అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో కేవలం అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతులు ఇచ్చారు. కంపెనీలు, పరిశ్రమలు చాలా తక్కువ శాతం ఉద్యోగులతో పనిచేయించాల్సి ఉంటుంది. ఇక టూరిస్టు ప్లేసులకు, ఇతర ప్రదేశాలకు అనుమతులు లేవు. కానీ అనిల్ అంబానీ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓ గోల్ఫ్ కోర్స్‌లో విహరించడం వివాదానికి దారి తీసింది.
మహాబలేశ్వర్ లో ఉన్న ఓ ప్రైవేటు గోల్ఫ్ కోర్సులో అనిల్ అంబానీ తన కుటుంబ సభ్యులతో కలిసి విహరించారు. అయితే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కరోనా వల్ల అలాంటి ప్రదేశాలను మూసివేశారు. అలాంటిది అనిల్ అంబానీ ఎలా వెళ్లగలిగారని అందరూ ప్రశ్నించారు. దీంతో వివాదం పెద్దది కాకముందే మహాబలేశ్‌వర్ కౌన్సిల్ చీఫ్ ఆఫీసర్ సదరు గోల్ఫ్ కోర్స్ యాజమాన్యానికి డిజాస్టర్ మేనేజ్‌మెంట్, ఎపిడెమిక్ డిసీజెస్ యాక్టుల కింద నోటీసులు జారీ చేసి హెచ్చరికలు పంపించారు.
కాగా ఆ నోటీసులను అందుకున్న సదరు గోల్ఫ్ కోర్స్ యాజమాన్యం దాన్ని మూసి వేసింది. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఆ గోల్ప్ కోర్సును ఎలా ఓపెన్ చేశారని నెటిజన్లు కూడా ప్రశ్నిస్తున్నారు. అక్కడి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే మహారాష్ట్రలో గత కొద్ది రోజుల క్రితం భారీగా కరోనా కేసులు నమోదైనప్పటికీ కఠిన ఆంక్షల వల్ల కరోనా కొద్దిగా తగ్గింది. అయినప్పటికీ అక్కడ కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నారు.