పదేళ్ల తర్వాత పాకిస్థాన్ విదేశాంగ మంత్రి భారత్ కు రానున్నారు. గోవా వేదికగా మే 4, 5 తేదీల్లో జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సులో పాల్గొనేందుకు బిలావల్ భుట్టో జర్దారీ భారత్‌కు వస్తారని పాక్ విదేశీ వ్యవహారాల కార్యాలయ అధికారి ముంతాజ్ జహ్రా బలోచ్ తెలిపారు. ఎస్‌సీవో విదేశాంగ మంత్రుల భేటీకి హాజరుకావాలన్న భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ ఆహ్వానం మేరకు ఈ పర్యటన ఖరారైందని వెల్లడించారు.
ఈ పర్యటన ఎస్‌సీవో కూటమి పట్ల పాక్ నిబద్ధతకు అద్దం పడుతోందన్నారు. 2014లో అప్పటి పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ పర్యటన తర్వాత ఆ దేశ నాయకులు భారత్‌కు రావడం ఇదే తొలిసారి. 2015 డిసెంబరులో నాటి భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ పాక్‌లో పర్యటించగా, ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పాకిస్థాన్‌ను సందర్శించారు.
బిలావల్ భుట్టో పర్యటనపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ స్పందిస్తూ.. ‘‘అందరితోపాటు వాళ్లనూ పిలిచాం. ఏదో ఒక దేశం పాల్గొనడం గురించి మాట్లాడుకోవడం సరికాదు’’ అని బదులిచ్చారు.