తెలంగాణ కొత్త పరిపాలనా సౌధం ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోంది. హైదరాబాద్ నడిబొడ్డున.. హుస్సేన్ సాగర్ తీరాన ఆధునిక సాంకేతికతతో.. అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ సచివాలయం ప్రారంభోత్సవం ఈనెల 30వ తేదీన జరగనుంది. అయితే ఈ సచివాలయానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మరి వాటి గురించి మీకు తెలుసా..?
- దేశంలో ఇటీవల కాలంలో నిర్మించిన సచివాలయ భవనాల్లో తెలంగాణ నిర్మించిన నూతన ప్రాంగణమే అగ్రగామిగా నిలవనుంది. 10.52 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో భారీ నిర్మాణంగా తెలంగాణ సచివాలయం రికార్డులకు ఎక్కనుంది.
- భవనం ఆరో అంతస్తులో ముఖ్యమంత్రి కార్యాలయం కొలువు తీరింది. దీంతోపాటు నాలుగు సమావేశ మందిరాలను ఏర్పాటు చేశారు. నూతన సచివాలయానికి నాలుగు వైపులా ప్రవేశ ద్వారాలను ఏర్పాటు చేశారు.
- ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన మునుపటి సచివాలయంలో సుమారు 9 లక్షల చ.అ. విస్తీర్ణంలో ఉండి.. శిథిలావస్థకు చేరిన దాదాపు 22 నిర్మాణాలను 24 గంటల వ్యవధిలో సంప్రదాయ విధానంలో కూల్చివేశారు. 1.40 లక్షల టన్నుల (14 వేల ట్రిప్పుల) నిర్మాణ వ్యర్థాలను తొలగించారు.
- కొత్త సచివాలయ నిర్మాణం కోసం గుత్తేదారులు, అధికారులు 26 నెలలు శ్రమించారు. అందులో నాలుగు నెలలు కరోనాతో ఎలాంటి పనులు నిర్వహించలేని పరిస్థితి. ఆ సమయాన్ని అధికారులు నిర్మాణ ప్రణాళిక రూపకల్పనకు వినియోగించుకున్నారు. మొత్తానికి దేశంలోనే భారీ సచివాలయ నిర్మాణాన్ని 26 నెలల్లో పూర్తి చేశారు.