కాంగ్రెస్ పార్టీ కి మరోసారి వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్..!

-

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ కాంగ్రెస్‌ వ్యూహకర్తగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్‌ అధిష్టానం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. గత ఏడాది కూడా ఆయనతో చర్చలు జరిపినప్పటికీ ఫలించలేవు. ఆ సమయంలో ప్రశాంత్‌ కిశోర్‌ వ్యూహకర్తగా కాకుండా.. పార్టీలో కీలక పదవిని చేపట్టనున్నారంటూ ఊహాగానాలొచ్చాయి. అయితే ఆ చర్చలు అర్థాంతరంగా ముగిశాయి.

 

 

 

ఈ ఏడాది చివరలో గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో.. ప్రశాంత్‌ కిశోర్‌ మరోసారి  రంగంలోకి దిగనున్నాడన్న వార్తలు ఊపందుకున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలతో చర్చలు జరిపినట్లు సమాచారం.  ప్రశాంత్‌కిషోర్‌ వ్యూహకర్తగా వ్యవహరించడాన్ని గుజరాత్‌లోని కొందరు నేతలు స్వాగతిస్తుండగా, మరి కొందరు నేతలు మాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా గోవా ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యూహకర్తగా ప్రశాంత్‌ కిషోర్‌ వ్యవహరించినప్పటికీ.. మమతా బెనర్జీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయారు. అలాగే 2017లో జరిగిన యుపి అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు ప్రశాంత్‌ కిశోర్‌ సేవలందించారు. ఆ ఎన్నికల్లో పార్టీ కేవలం ఏడు సీట్లకే పరిమితమైంది. ప్రస్తుతం కాంగ్రెస్‌.. జాతీయ స్థాయిలో వ్యూహకర్త బాధ్యతలను ప్రశాంత్‌కిషోర్‌ బృందానికి చెందిన సునీల్‌ కనుగోలుకు అప్పగించింది. 2023లో జరిగే కర్ణాటక ఎన్నికల వ్యూహాలను ప్రస్తుతం ఆయన పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు వ్యూహకర్తలు ఉంటే పార్టీకి లాభం కంటే నష్టం ఎక్కువ వచ్చే ప్రమాదం ఉందని కొందరు నేతలు హెచ్చరిస్తున్నారు. ప్రశాంత్‌ కిశోర్‌ సేవలను కేవలం గుజరాత్‌, హిమాచల్‌ రాష్ట్రాలకు పరిమితం చేస్తే బాగుంటుందని అంటున్నారు.

అయితే జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని ప్రశాంత్‌కిషోర్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి ప్రత్యామ్నాయాన్ని రూపొందించాలని, ఇందుకోసం కాంగ్రెసలో చేరాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఓవైపు సార్వత్రిక ఎన్నికలలోపు కాంగ్రెసను బలోపేతం చేయడం, మరోవైపు ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకురావడం దిశగా ఆయన కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. మమతా బెనర్జీ, శరద్‌ పవార్‌, స్టాలిన్‌, ఉద్ధవ్‌ థాకరే, అఖిలేశ్‌ యాదవ్‌, కెసిఆర్‌, హేమంత్‌ సోరెన్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌లతో ప్రశాంత్‌ కిశోర్‌కు ఉన్న సంబంధాలతో అందరినీ ఒకే వేదికపైకి ఆయన తీసుకురాగలరని ఈ వర్గాలు భావిస్తున్నాయి. రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీసగఢ్‌, గుజరాత్‌, ఉత్తరాఖండ్‌, మహారాష్ట్ర, అసోం, హర్యానా, జార్ఖండ్‌లలో కాంగ్రెసను బలోపేతం చేస్తే తప్ప.. బిజెపిని ఎదుర్కోవడం కష్టమని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ బలహీనపడడం వల్ల 90 శాతం సీట్లను బీజేపీ గెలుచుకుంటోందని, ఈ నష్టాన్ని కనీసం 50 శాతానికి తగ్గిస్తే కాంగ్రెస్‌ పోటీలో నిలబడుతుందని భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకు కాంగ్రెస్‌ పార్టీ పని సంస్కఅతి మారాలని, సంస్థాగత పునర్వ్యవస్థీకరణ, పార్టీ నిర్వహణలో సమూలంగా మార్పులు రావాలని కోరుకుంటున్నట్లు సమాచారం.  అయితే కిశోర్‌ విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అధిష్ఠాన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news